Begin typing your search above and press return to search.

ఉన్నదే 21 మంది వారిలో ఐదుగురు గైర్హాజరు

By:  Tupaki Desk   |   19 Jan 2020 4:26 PM GMT
ఉన్నదే 21 మంది వారిలో ఐదుగురు గైర్హాజరు
X
తెలుగు దేశం పార్టీ... నానాటికీ బక్కచిక్కిపోతున్న పార్టీగా ఓ రేంజిలో ప్రచారం సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏనాడూ ఎరుగనంత ఘోర పరాభవం ఎదురు కాగా... 175 సీట్లకు గాను 23 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ 23 లోనూ ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీకి దూరమైపోయారు. అంటే.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ నికర బలం 21 మంది మాత్రమేనన్న మాట. ఇలాంటి కీలక సమయంతో రేపు అసెంబ్లీ సమావేశాలనగా... పార్టీ శాసనసభాపక్ష భేటీని ఏర్పాటు చేస్తే... ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీకి డుమ్మా కొట్టేశారు. అసలే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కీలకమైన టీడీఎల్పీ భేటీకి ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు... మిగిలి ఉన్న వారిలో దాదాపుగా పావు శాతం మంది గైర్హాజరవడం నిజంగానే ఆ పార్టీని కలవరానికి గురి చేసిందనే చెప్పాలి.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ అధిష్ఠానం టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ పార్టీకి అత్యంత కీలకమనే చెప్పాలి. ఓ వైపు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు సిద్ధమైపోయిన జగన్... ఆ మేరకు తీర్మానాలు చేసేందుకే అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రాజధాని రైతులు 30 రోజులకు పైగా చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇస్తున్న టీడీపీ... రాజధానిని అమరావతి నుంచి కదిలించకుండా పకడ్బందీ ప్లాన్ రచిస్తోంది. దీనికి పదును పెట్టేందుకు కూడా ఆదివారం నాటి టీడీఎల్పీ భేటీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయన్న వార్తలూ వినిపించాయి. ఎలా చూసినా... ఈ భేటీ టీడీపీకి అత్యంత ప్రాధాన్యం కలిగిన భేటీనే.

ఇలాంటి భేటీకి ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేశారు. అలా డుమ్మా కొట్టిన వారిలో గంటా శ్రీనివాసరావు - వాసుపల్లి గణేశ్ - అశోక్ - అనగాని భవాని హాజరుకాలేదు. టీడీఎల్పీ భేటీకి వీరంతా హాజరు కాలేదన్న వార్తలు టీడీపీలో పెను కలకలమే రేపాయి. అంతేకాకుండా ఏకంగా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ కీలక సమావేశానికి రాలేదన్న విషయం కూడా మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే వారంతా సమావేశానికి రాలేకపోతున్నామని పార్టీకి ముందే సమాచారం పంపినట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే వారు సమావేశానికి రాలేదన్న విషయాన్ని టీడీపీ మాత్రమే చెప్పడం, గైర్హాజరు అయిన ఎమ్మెల్యేలు అసలు నోరు విప్పకపోవడం చూస్తుంటే... టీడీపీకి త్వరలోనే గట్టి ఎదురు దెబ్బే తప్పదన్న గుసగుసలు మొదలైపోయాయి.