Begin typing your search above and press return to search.

జగన్ పాలనలో టీడీపీ పెత్తనమా..?

By:  Tupaki Desk   |   10 July 2019 6:35 AM GMT
జగన్ పాలనలో టీడీపీ పెత్తనమా..?
X
పదవి ఆశ ఎప్పటికీ తీరదు. అందుకే నేతలంతా మంత్రి పదవులన్నా.. కార్పొరేషన్ పదవులున్నా చెవికోసుకుంటారు. ఆ పదవులను వీడితే నైరాశ్యంలో కూరుకుపోతారు. పదవుల కోసం ఎంతకైనా ‘వెచ్చిస్తారు’. పదవి ఉంటే పలుకుబడి అన్నది రాజకీయాల్లో ఉన్న సామెత. కానీ ఏపీలో మాత్రం అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలకు ఆ పదవులే అందకుండా పోవడం కలవరపెడుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 రోజులు కావస్తున్నా ఇంకా టీడీపీ నేతలే నామినేటెడ్ పదవుల్లో దర్జాగా అధికారాన్ని అనుభవించడం వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. అధికారంలోకి వచ్చి ఏమిటీ దుస్థితి అని వైసీపీ నేతలు వాపోతున్నారు.

ఏపీలో అధికారం కోల్పోయినా చంద్రబాబు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో నియామకమైన నేతలు రాజీనామాలు చేయడానికి ససేమిరా అంటున్నారు. బెల్లం లాంటి పదవులను వీడడం లేదు. మొన్న టీటీడీ చైర్మన్ పదవిని వదలడానికి పుట్టా సుధాకర్ ఒప్పుకోకపోవడం తర్వాత ఎంత రాద్ధాంతమైందో చూశాం. జగన్ కఠినంగా వ్యవహరించడానికి రెడీ అయ్యే వేళ చివరకు పుట్టా వైదొలిగారు.

అయితే మిగతా నామినేటెడ్ పోస్టుల్లో తిష్టవేసిన టీడీపీ నేతలు మాత్రం పదవులను వదలంటున్నారు. సహజంగా ప్రభుత్వం మారితే హుందాగా గత ప్రభుత్వంలో నియమితులైన వారు రాజీనామా చేయడం ఆనవాయితీ.. కానీ టీడీపీ నేతలు మాత్రం పదవులను వీడేది లేదని తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ దీవి శివరాం - స్టేట్ హౌసింగ్ చైర్మన్ రాంబాబు - ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ నాగుల్ మీరా - ఆర్టీ సీ చైర్మన్ వర్ల రామయ్య - పలువురు ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు - ఎస్పీ కోఆపరేటివ్ సంస్థ చైర్మన్ జూపూడి ప్రభాకర్ - శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరిలు జగన్ ప్రభుత్వం కొలువుదీరినా తాము పదవులు వీడేది లేదంటున్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగచేస్తోంది. ప్రభుత్వం తొలగించే వరకూ పదవులు పట్టుకొని వేలాడాలని నిర్ణయించారు.

ఇక కేబినెట్ విస్తరణలో జగన్ సీనియర్లు అయిన రోజా - ధర్మాన ప్రసాద్ రావు సహా చాలా మందికి అగ్ర సామాజికవర్గాలు - కుల - మత - సామాజిక కోణంలో పక్కనపెట్టారు. వారంతా నామినేటెడ్ పదవులపైనే ఆశగా ఉన్నారు. సీఎం జగన్ వారిందరికీ నామినేటెడ్ పోస్టులు ఇద్దామంటే టీడీపీ నేతలు వైదొలగడం లేదు. మరి వీరిని ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికోసం ఆర్డినెన్స్ లు - అసెంబ్లీలో కొత్త బిల్లులకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. న్యాయపర చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలని చూస్తోంది. సీఎం జగన్ ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తిగా మారింది.