Begin typing your search above and press return to search.

చంద్రబాబు పని అయిపోయినట్లేనా.?

By:  Tupaki Desk   |   9 March 2019 6:28 AM GMT
చంద్రబాబు పని అయిపోయినట్లేనా.?
X
టీడీపీ సుప్రీమో అనగానే అందరికి చంద్రబాబు నాయుడే గుర్తొస్తాడు. ఎన్టీఆర్‌ పేరు చెప్పకపోతే.. ఎక్కడ ఎన్టీఆర్‌ అభిమానులు తమను పట్టించుకోరేమోనని ఆయన పేరు వాడుకుంటారు కానీ.. ఎన్టీఆర్‌ కి - ఎన్టీఆర్‌ వారసులకు అసలు పార్టీలో స్థానమే లేదు. ఇక ఎన్టీఆర్‌ ని పదవి నుంచి తప్పించేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అనతి కాలంలోనే పార్టీపై పట్టు సాధించారు. 1999 ఎన్నికల్లో రెండోసారి పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన మాటకు అడ్డు చెప్పే వాయిసే పార్టీలో లేకుండా పోయింది.

టీడీపీ అంటే చంద్రబాబు - చంద్రబాబు అంటే టీడీపీ అనేంతంగా పేరు వచ్చేసింది. దీంతో..చంద్రబాబు మాట కాదని పార్టీలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరిగేది కాదు. ఆయన ఆగ్రహిస్తే.. అవతలి వారి అడ్రస్‌ గల్లంతే. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే చంద్రబాబు ఊరుకునేవారు కాదు. ఎమ్మెల్యే ఫలానా అంటే చాలు ఆయనకు అందరూ ఓకే చెప్పాల్సిందే. అసమ్మతి లాంటి పదాల్ని చంద్రబాబు ఒప్పుకోరు. ఇదంతా నిన్నటివరకు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లే కన్పిస్తుంది. పార్టీపై ఆయన క్రమక్రమంగా పట్టు కొల్పోతున్నట్లు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఎలాంటి సమావేశాలు పెట్టకూడదు అంటూ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు తమ కార్యకర్తలతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన సీనియర్ నాయకుడు బాపిరాజు తమ అధినేత చంద్రబాబును బహిరంగంగానే ధిక్కరించడం ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో వేచి ఉన్న తనకు కాదని ఈలి నాని కి టికెట్ ఇవ్వడంతో రాజు తన అనుచరగణంతో సమావేశమయ్యారు. ఇంకొన్ని చోట్ల టిక్కెట్లు రాని టీడీపీ అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇన్నాళ్లు ఒంటిచేత్తో పార్టీని నడిపించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల సాక్షిగా ఎదురుగాలి వీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.