Begin typing your search above and press return to search.

వారి కలయిక...దేశం గుండెల్లో గుబులు

By:  Tupaki Desk   |   16 Jan 2019 3:26 PM GMT
వారి కలయిక...దేశం గుండెల్లో గుబులు
X
ఒకరు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు. మరోకరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ ఇద్దరూ యువనాయకులే. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతోంది. మరోకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని పోలికలు ఉన్న ఈ ఇద్దరి యువనాయకులు హైదరాబాదులో సమవేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కలిసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు కలిసారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ ఇద్దరు యువనాయకులు తమ సమావేశం తర్వాత ఓ స్పష్టతను ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాతో పాటు తెలుగు రాష్ట్రాల సమస్యలపై కేంద్రంతో పోరాడేందుకు తామూ కలిసామని చెప్పారు. వీరి ప్రకటన తర్వాత తెలుగు రాష్ట్రాలలో వీరి కలయికపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులలో వీరి కలయిక ఆందోళన రేకెత్తిస్తోందని అంటున్నారు.

ఆంధ్ర్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకులు కలవడం తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడిని దెబ్బ తీసేందుకే ఈ పార్టీల నాయకులు కలిసారంటూ తెలుగుదేశం నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వీరి కలయిక తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేయడమేనని ఆ పార్టీ నాయకుల ప్రకటనల సారాంశం. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చూపించిన అత్యుత్సాహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే వైఎస్. జగన్ మోహన రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సమావేశం అయ్యారని తెలుగుదేశం నాయకుల ఆందోళన. ఈ కలయికతో తెలుగుదేశం పార్టీ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.