Begin typing your search above and press return to search.

అవిగో లెక్కలు..ఎలా దాస్తారు నిజాలు..!

By:  Tupaki Desk   |   20 July 2018 4:36 PM GMT
అవిగో లెక్కలు..ఎలా దాస్తారు నిజాలు..!
X
" ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు కంటి తుడుపు నిధులు ఇస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సైతం నిధులు మంజూరులో కాలయాపన చేస్తున్నారు." ఇవీ గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - మంత్రులు - తెలుగుదేశం నాయకులు చెబుతున్న మాటలు. అయితే ఇవన్నీ వాస్తవాలు కాదని తాము ఏఏ అంశాలకు ఎన్ని నిధులిచ్ఛామో కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాధ్ సింగ్ లోక్‌ సభ సాక్షిగా లెక్కలు చెప్పారు. ఈ లెక్కలు తప్పని - అబద్దాలని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. లోక్‌ సభ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం సాధ్యం కాదు. అధికార పార్టీ లోక్‌ సభలోనూ - రాజ్యసభలోనూ తప్పుడు వాగ్దానాలు చేయచ్చు తప్ప తప్పుడు లెక్కలు చెప్పలేరు. ఈ విషయం విభజన సమయంలో అటు లోక్‌ సభలోనూ - రాజ్యసభలోనూ కూడా నిరూపితమైంది. ఈ రెండు సభలలోను అధికార పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను ఆ తర్వాత బిజేపి ప్రభుత్వం తుంగలో తొక్కింది. అయితే నిధులు - పంపకాల గురించి రెండు సభలలోను వెల్లడించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏర్పడిన బిజేపి ప్రభుత్వం ఈ నిధులను - పంపకాలను చేపట్టింది.

లోక్‌ సభ అంటే ఆషామాషీ కాదు. అత్యున్నత్త విలువలున్న లోక్‌ సభలో చెప్పిన అంశాలపై మరొక మాట చెప్పడం సభను అగౌరవ పరచడమే. ఈ విషయం జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి తెలియంది కాదు. సభలో అద్వానీ - సుష్మా స్వరాజ్ - సోనియా గాంధీ - మల్లికార్జున ఖర్గే - ఆశోకగజపతి రాజు వంటి సీనియర్లున్న సభ్యులకు తెలియంది కాదు. లోక్‌ సభలో రాజ్‌ నాధ్ సింగ్ శుక్రవారం చెప్పిన నిధుల లెక్కలు అవాస్తవాలు కాదని సీనియర్లందరికీ తెలుసు. దీంతో లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ లెక్కలన్నీ వాస్తవాలే అని నిరూపితమవుతుంది. ఈ నిజాలను కూడా అబద్దాలుగా చిత్రీకరించాలనుకోవడం తెలుగుదేశం సభ్యులకు సమంజసం కాదని రాజకీయ పరీశీలకులు అంటున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చామని చెప్తున్న నిధులపై చంద్రబాబు అండ్ కో ఎంత గొబెల్స్ ప్రచారం చేసినా లోక్‌ సభ రికార్డులు మాత్రం అబద్దాలు చెప్పవు కదా... !?