Begin typing your search above and press return to search.

వర్మ పాట.. షేక్ అవుతున్న టీడీపీ

By:  Tupaki Desk   |   22 Dec 2018 7:17 AM GMT
వర్మ పాట.. షేక్ అవుతున్న టీడీపీ
X
దివంగత ముఖ్యమంత్రి - టీడీపీ వ్యవస్థాపకులు ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను ఆయన కుమారుడు - నటుడు బాలక్రిష్ణ నిన్న ఘనంగా లాంచ్ చేశారు. అతిరథుల మధ్య టీజర్ ను విడుదల చేశారు. అయితే మొదట ఈ బయోపిక్ కు దర్శకుడిగా రాంగోపాల్ వర్మను అనుకొని ఆయన నచ్చక బాలయ్య మార్చేశారు. దీన్ని అవమానంగా భావించిన వర్మ.. ఆనాడే బాలయ్యకు వ్యతిరేకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి పూనుకున్నారు..

ఇలా బాలయ్య వర్సెస్ రాంగోపాల్ వర్మ గా ఎన్టీఆర్ బయోపిక్ రూపాంతరం చెందింది. ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్ లాంచ్ నాడే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నుంచి వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. అందులో ఎన్టీఆర్ ను మోసం చేసిన చంద్రబాబు అర్థం వచ్చేలా విచ్చలవిడిగా చంద్రబాబు ఫొటోలు - వీడియోలను వాడేశారు. దీనిపై దుమారం రేగింది. టీడీపీ మద్దతు దారులు - నాయకులు వర్మపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నెటిజన్లు కూడా వర్మను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.

చంద్రబాబు టార్గెట్ గా ఆర్జీవీ విడుదల చేసిన ‘వెన్నుపోటు’ పాటకు విపరీతమైన స్పందన.. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇందులో చంద్రబాబు ప్రస్తుత ఫొటోలు వీడియోలు వాడడంతో వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని 1995 వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ను చూపడం దుమారం రేపింది. అయితే ఆర్జీవీ తాజా పాటపై నందమూరి - టీడీపీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. లక్ష్మీపార్వతి ప్రోద్బలంతోపాటు ఓ వైసీపీ నేత నిర్మాతగా ఆర్జీవీతో ఈ సినిమా తీస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.

సహజంగా జనాలు చరిత్ర కంటే వివాదాలు - నెగెటివ్ అంశాల పట్లే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అందుకే వర్మ ‘వెన్నుపోటు’ పాట రిలీజ్ కాగానే విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఉపద్రవం వస్తుందోనన్న టెన్షన్ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందట..

అందుకే తాజాగా టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా వర్మకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులు వర్మను ప్రోత్సహిస్తూ షేర్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబు ఫొటో వాడడంపై వర్మపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆర్జీవీ ఇలా బోల్డ్ గా చంద్రబాబుపై పాట చిత్రీకరించడంతో టీడీపీ బోల్డ్ అయ్యిందనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగా ఆర్జీవీ పాట - సినిమా హాట్ టాపిక్ గా మారింది.