Begin typing your search above and press return to search.

చంద్రబాబును ఎవరూ లెక్క చేయడం లేదా?

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:30 PM GMT
చంద్రబాబును ఎవరూ లెక్క చేయడం లేదా?
X
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ... ఒక పద్ధతి ప్రకారం సాగే విధానాలు, అధిష్ఠానం సూచనలు పాటించడం వంటివన్నీ అక్కడ ఉంటాయి. అయితే... ఆ క్రమశిక్షణ ఇప్పుడు కనుమరుగు అవుతోందా? టిడిపి అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడును నాయకులు లెక్క చేయడం లేదా? పార్టీపై చంద్రబాబు పట్టు సడలుతుందా? అధినేత ఎవరినీ నియంత్రించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చ ఇది.

రాజకీయ అవసరాలు - కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వెళ్లకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలకు రెడ్‌ కార్పెట్ వేస్తోన్న చంద్రబాబునాయుడు విధానాల వల్ల, తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే అరాచకంగా మారే ప్రమాదం ఏర్పడిందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాయ కులకు చంద్రబాబునాయుడంటే భయం - భక్తి - గౌరవం ఉండేదని, ఇప్పుడు అలాంటివేమీ లేకుండా పోయాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ''కాంగ్రెస్ నాయకుల నోటికి అడ్డు అదుపు ఉండదు. వాళ్లది జాతీయ పార్టీ. వాళ్ల పార్టీ అధినేతను పొగిడి, సహచరులను బహిరంగంగా విమర్శించినా ఆ పార్టీ పట్టించుకోదు. కానీ మాది అలా కాదు. అడిగేవాడు లేకపోవడంతో స్వేచ్ఛగా బతికిన కాంగ్రెస్ వాళ్లను మా పార్టీలో చేర్చుకున్నారు. మరి వారి అలవాట్లు ఎలా మారతాయి? చంద్రబాబును నిరంతరం విమర్శించే మందకృష్ణను డొక్కా మాణిక్యప్రసాద్ పొగిడి, మంత్రిని విమర్శించారు. ఇంకోవైపు బాబునూ పొగిడారు. అలాంటి వారిని తీసుకున్న నాయకత్వానిదే తప్పు'' అని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లాలో మంత్రి, మాజీ మంత్రి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో.. తాజాగా ఎంపి కూడా తలదూర్చడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మందకృష్ణను తమ నాయకుడిగా పొగిడి, సొంత పార్టీ మంత్రి పుల్లారావును విమర్శించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యవహారశైలిపై పార్టీ వాదుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పతిపక్షంలో పార్టీని మోసిన పుల్లారావును విమర్శించే నైతిక హక్కు డొక్కాకు గానీ, ఆయనను సమర్ధించిన రాయపాటికి గానీ లేదంటున్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఎంపి అయిన జెసి దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్‌ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్లు మీడియాతో మాట్లాడుతుండటాన్ని పార్టీ సీనియర్లు సహించలేకపోతున్నారు. ప్రభాకర్‌ రెడ్డి ప్రభుత్వ వైఖరికి నిరసనగా గన్‌ మెన్లను వెనక్కి పంపి, అజ్ఞాతంలోకి వెళ్లారు. తమకు తెలుగుదేశం పార్టీ ఎంత అవసరం ఉందో తమతో పార్టీకీ అంతే అవసరం ఉందని ప్రభాకర్‌ రెడ్డి మీడియా వద్ద బాహాటంగానే వ్యాఖ్యా నించారు. గతంలో నాలుగుసార్లు జెసి ప్రత్యక హోదా అంశంపై పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. బాబు అంటే అధికారులకు భయం పోయిందని వ్యాఖ్యానించారు. అయినా రాయపాటిని కనీసం మందలించలేదు.నర్సరావుపేట అధికార పార్టీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేరుకు టిడిపి ఎంపి అయినప్పటికీ, ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గతంలో ఆయన ప్రధాని మీదనే విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపి నాశనం అవుతుందని శపించారు. తాజాగా తన శిష్యుడయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సమర్ధించారు. డొక్కా చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు.

అటు ఉత్తరాంధ్రలో మంత్రులు గంటా శ్రీనివాస్.. అయ్యన్నపాత్రుడు మధ్య బహిరంగ యుద్ధం జరుగుతోంది. ఇద్దరి మధ్యన అధికారులు నలిగి పోతున్నారు. చివరకు కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి వద్దకు చేరుతున్నాయి. ఒక దశలో ఇద్దరూ సీఎం వద్ద పంచాయితీ పెట్టుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమ - ఎమ్మెల్యే వంశీ మధ్య రామవరప్పాడు పేదలభూములపై పెద్ద వివాదమే మొదలయింది. ఎక్కువగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో పార్టీ క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతింటోందని, వారిని చూసి తమ పార్టీ నాయకులు కూడా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వెళ్లకూడదన్న తమ అధినేత వ్యూహం చివరకు పార్టీని క్రమశిక్షణ, కట్టుబాటును దెబ్బతినేలా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.