Begin typing your search above and press return to search.

జేసీని త‌మ్ముళ్లంతా శ‌భాష్ అనేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   30 May 2018 8:13 AM GMT
జేసీని త‌మ్ముళ్లంతా శ‌భాష్ అనేస్తున్నార‌ట‌!
X
ఏంటి?.. బాబును జేసీ దివాక‌ర్ రెడ్డి ఏదైనా అంటే.. తెలుగు త‌మ్ముళ్లు తెగ సంతోష‌ప‌డిపోతున్నారా? ఇదేమైనా న‌మ్మే మాటేనా? బాబు మీద విష ప్ర‌చారం చేయ‌టానికే ఇలాంటివ‌న్నీ అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం తెలుగు త‌మ్ముళ్ల‌లో చాలామందికి సంతోషాన్ని నింప‌ట‌మే కాదు.. త‌మ మ‌న‌సులోని మాట‌ను ధైర్యంగా చెప్పిన జేసీని గుట్టు చ‌ప్పుడు కాకుండా అదే ప‌నిగా పొగిడేస్తున్న వైనం ఏపీ అధికార‌ప‌క్షంలో క‌నిపిస్తోంది.

మ‌హానాడు మూడో రోజున జేసీ దివాక‌ర్ రెడ్డికి మాట్లాడే అవ‌కాశం ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ర‌హాలో ప్ర‌సంగించారు. బాబు త‌ప్పుల్ని స‌భాముఖంగా క‌డిగేయ‌టానికి ఏ మాత్రం సంకోచించ‌లేదు. అలా అని అధినేత ఇగో దెబ్బ తిన‌కుండా ఉండ‌టానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

నిత్యం అధికారుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ లంటూ గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని తినేసే బాబు తీరును సూటిగా ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. సార్.. మీ వెంట‌నే ఆ ప‌ద్ద‌తి మార్చుకోవాలి సార్‌.. ఊళ్ల‌ల్లో అధికారులు ప‌ని చేయ‌టం లేదు సార్ అంటూ తేల్చి చెప్పారు. జ‌న్మ‌భూమి క‌మిటీల మీద త‌న‌కున్న అసంతృప్తిని బ‌య‌ట పెట్టేసిన జేసీ.. సార్.. ఇక్క‌డున్నోళ్లంతా ఓపెన్ గా చెప్ప‌రు సార్‌. అంద‌రూ మిమ్మ‌ల్ని పొగిడేసే వాళ్లే. నేను పొగ‌డ‌గ‌ల‌ను.. కానీ ఆ ప‌ని చేయ‌న‌ని చెప్పారు.

స‌భ‌కు హాజ‌రైన చోటా నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు ఎవ‌రూ నేరుగా వ‌చ్చి మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేర‌ని.. గ్రౌండ్ లెవెల్లో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌టం లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు జేసీ. త‌ను మాట్లాడుతుంటే టైమ్ అయిపోయిందంటూ వ‌చ్చిన ఎంపీ రామ్మోహ‌ననాయుడ్ని స‌ర‌దాగా వారిస్తూ.. తాను ఇంకా మాట్లాడాల్సింది ఉందంటూ మైకు ఇచ్చేందుకు నిరాక‌రించారు. మొత్తంగా త‌న ప్ర‌సంగంలో బాబును కాస్త పొగిడినా.. ఆయ‌న చేస్తున్న త‌ప్పుల్ని సూటిగా ఎత్తి చూప‌ట‌మే కాదు.. మీ తీరును మార్చుకోవాలంటూ చెప్పిన జేసీ తీరును ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బాబుకు స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చే సాహ‌సం తాము చేయ‌లేమ‌ని.. కానీ.. త‌మ‌కు కుద‌ర‌ని ప‌నిని జేసీ చాలా ధైర్యంగా చెప్ప‌టాన్ని అభినందించారు. అలా అని అంద‌రికి తెలిసేలా చేస్తే బాగోద‌ని.. బాబుకు తెలిస్తే లేనిపోని తిప్ప‌ల‌న్న ఉద్దేశంతో తెలుగు త‌మ్ముళ్లు లోగుట్టుగా జేసీని అభినంద‌న‌లు తెలిపిన‌ట్లుగా చెబుతున్నారు. బాబు ఇమేజ్ కు ఇబ్బందికి గురి చేసేలా జేసీ మాట‌లు ఉన్నా.. అవ‌న్నీ బాబుపై ప్ర‌జ‌ల్లో.. పార్టీలో ఉన్న కంప్లైంట్ లే కావ‌టంతో వాటి విష‌యంలో బాబు మారితే అంతిమంగా ఆయ‌న‌కే లాభ‌మ‌న్న మాట‌ను కొంద‌రు చెప్ప‌టం గ‌మ‌నార్హం.