Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇలాకాలో టీడీపీకి కొత్త త‌ల‌నొప్పులు

By:  Tupaki Desk   |   21 Dec 2015 9:26 AM GMT
కేసీఆర్ ఇలాకాలో టీడీపీకి కొత్త త‌ల‌నొప్పులు
X
తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మూలిగే న‌క్క‌మీద తాటిపండు ప‌డిన చందంగా ఉంది. తెరాస ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు పార్టీ విల‌విల్లాడుతోంది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు పార్టీనీ వీడిపోయారు. అయితే ఉన్న నాయ‌కుల మ‌ధ్య కూడా స‌వాల‌క్ష విబేధాల‌తో పార్టీ మ‌రింత బ‌ల‌హీన‌మ‌వుతోంది. సీఎం కేసీఆర్ సొంత ఇలాకా అయిన మెద‌క్ జిల్లాల్లో టీడీపీ క్ర‌మ‌క్ర‌మంగా బ‌ల‌హీన‌మ‌వుతోందా? నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డిందా? ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీలో ఉన్న లొసుగులు బ‌య‌ట‌ప‌డుతున్నాయా? కొంద‌రు నాయ‌కులు ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మిగిలిన వారికి ఇబ్బందిగా మారిందా? వారి తీరుతో కొంద‌రు నేత‌లు పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారా? అంటే అవున‌నే అంటున్నారు పార్టీ నేత‌లు. తొంద‌ర‌లోనే ఈ విష‌యంపై కొంద‌రు జిల్లా నేత‌లు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ కు ఫిర్యాదు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

జిల్లా తెలుగుదేశంలో నాయ‌కుల మ‌ధ్య లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. శాస‌న‌మండ‌లి స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థి ఎంపిక విష‌య‌మై చివ‌రి వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జిల‌కు - నాయ‌కులకూ స‌మాచారం లేక‌పోవ‌డం ఈ విష‌యాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంది. నామినేష‌న్ చివ‌రి రోజున‌.. ఎవ‌రైనా అభ్య‌ర్థితో నామినేష‌న్ వేయించి, పోటీలో ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పార్టీలో కొందరు విమ‌ర్శిస్తున్నారు. అభ్య‌ర్థి త‌న నామినేష‌న్‌ ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో పార్టీకి ఉన్న ప‌రువు కూడా పోయింద‌ని కొంద‌రు ఆవేద‌న చెందుతున్నారు. కాగా, చెర‌కు రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మెద‌క్ ఎస్‌ డీసీఎల్ ఫ్యాక్ట‌రీ ఎదుట ఆగ‌స్టు 26న‌ ధ‌ర్నా చేస్తామ‌ని జిల్లా నేత‌లు ఆర్భాటంగా ప్ర‌క‌టించారు.మూడు నెల‌లవుతున్నా.. దాని ఊసే లేదు. అయితే కొంత‌మంది నేత‌లు, ఎస్‌ డీసీఎల్ అధికారుతో కుమ్మ‌క్క‌య్యార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇలా పార్టీ నాయ‌కుల తీరుతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఒక ముఖ్య నేత పార్టీని వీడే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఎంపిక‌, ఉప‌సంహ‌ర‌ణ వంటి 16 అంశాల‌పై జిల్లా స‌మావేశంలో పాల్గొనేందుకు మెద‌క్ వ‌చ్చామ‌ని, అయితే స‌మావేశం వాయిదా ప‌డింద‌నే స‌మాచారం కూడా త‌మ‌కు అంద‌లేద‌ని కొంద‌రు నాయ‌కులు వాపోతున్నారు. అలాగే తెలుగు యువ‌త జిల్లా క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్రమాన్ని భారీగా నిర్వ‌హించాల‌నుకున్నా.. దానికి కూడా కొంద‌రు అడ్డుకున్నార‌ని పార్టీ యూత్ విభాగం నాయ‌కులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఏదేమైనా మెద‌క్ టీడీపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అక్క‌డ టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఇప్ప‌టికైనా అక్క‌డ దృష్టి పెడితే పార్టీలో ఉన్న చిన్నా చిత‌కా నాయ‌కులైనా పార్టీలో ఉంటారు లేక‌పోతే అంతే సంగ‌తులు అనుకోవాల్సిందే.