Begin typing your search above and press return to search.

బాబు బ్యాచ్ బెదిరింపు దందాలు షురూ

By:  Tupaki Desk   |   14 Aug 2017 3:34 AM GMT
బాబు బ్యాచ్ బెదిరింపు దందాలు షురూ
X
అనుకున్న‌దే జ‌రుగుతోంది. టీడీపీ త‌మ్ముళ్లలోని మ‌రో త‌ర‌హా మ‌నుషులు తెర మీద‌కు వ‌చ్చేస్తున్నారు. ఇంత‌కాలం ప్ర‌జ‌ల‌కు సాఫ్ట్ గా ఓట్లు వేయాల‌ని చెప్పుకున్న తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు మ‌రోత‌ర‌హాలో ప్ర‌చారాన్ని షురూ చేసేశారు. ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేలా చేయ‌టం మొద‌లెట్టేశారు.

తాము గెలిస్తే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని అలా చేస్తాం.. ఇలా చేస్తామంటూ ప‌గ‌టిపూటే క‌మ్మ‌టి క‌ల‌లు చూపిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు రూటు మార్చారు. నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం తేడా వ‌స్తే ఇప్ప‌టికే జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల మీద కూడా ప్ర‌భావం క‌నిపించే అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను వినిపిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఏపీ అధికార‌ప‌క్షం ఇప్పుడు ఎంత‌కైనా తాము సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గెలుపు త‌ప్ప మ‌రేదీ త‌మ‌కు ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వారి ధోర‌ణి మారింది. రోజురోజుకి పోటీ మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో.. అయ్యా..అమ్మా.. బాబు అంటూ ఓట్లు అడుక్కునే కార్య‌క్ర‌మానికి తెర దించేసిన తెలుగు త‌మ్ముళ్లు.. ఆదివారం త‌మ కొత్త వ్యూహాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు.

నంద్యాల‌లో పార్టీని గెలిపిస్తే ఎంత అభివృద్ధి జ‌రుగుతుంది? మ‌రెంత‌గా నంద్యాల ప‌ట్ట‌ణం మారిపోతుందో మాట‌ల్లో చెప్పిన ఏపీ మంత్రులు ఇప్పుడు త‌మ టోన్ ను మార్చేశారు. ఆదివారం నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి.. అమ‌ర‌నాథ్ రెడ్డి.. కాలువ శ్రీనివాసులు త‌దిత‌రుల వాయిస్ లో మార్పు వ‌చ్చేసింది. ఉప ఎన్నిక‌ల్లో అధికార‌ప‌క్ష అభ్య‌ర్థికి ఓటు వేయ‌క‌పోతే నంద్యాల‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు నిలిచిపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ త‌మ‌ను గెలిపించాల‌ని బ‌తిమిలాడే ధోర‌ణిలో మాట్లాడిన తెలుగు త‌మ్ముళ్ల మాట‌లు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రోజుల వ్య‌వ‌ధిలో మారిన టీడీపీ నేత‌ల మాట‌ల తీరుకు నంద్యాల ఓట‌ర్ల నోట మాట రావ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.