Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు న‌ష్టం చేస్తుంది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:16 AM GMT
లోకేష్‌ కు న‌ష్టం చేస్తుంది ఎవ‌రు?
X
కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌ గా రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అనుభవం పెంచుకునే దిశగా అడుగులేస్తున్న లోకేష్ పార్టీలో క్రియాశీలంగా మారుతున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే లోకేష్ ఎదుగుదల‌కు టీడీపీ శ్రేణులు ప‌రోక్షంగా అడ్డుపుల్ల వేస్తున్నారనే సందేహాలు తెలుగుత‌మ్ముళ్లే వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగుదేశం యువనేత లోకేష్ పార్టీ-ప్ర‌భుత్వం మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకువెళుతున్నారు. భవిష్యత్తులో పార్టీకి తిరుగులేని పునాది వేసేందుకు తన ముందున్న అన్ని మార్గాల్లో పయనిస్తున్నారు. పార్టీకి సాంకేతికతను అద్ది - కార్యకర్తల ఆర్ధిక సమస్యలు తీరుస్తూ క్యాడర్ లీడర్‌ గా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కొసం పనిచేస్తు, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి పార్టీగా రికార్డు సృష్టించిన లోకేష్, ఇప్పుడు ఎమ్మెల్యేలు - మంత్రుల సమన్వయంపై దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం సర్వేలు నిర్వహిస్తు, వారిని సరైన దారిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మంత్రులు - ఎమ్మెల్యే లకు ఇచ్చిన రేటింగుల వెనుక లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలే కారణమంటున్నారు. మ‌రోవైపు ఇటీవల ముగిసిన జనచైతన్య యాత్రలు లోకేష్‌ ను జనాలకు మరింత చేరువ చేశాయి. తండ్రితోపాటు సమానంగా ఆయన యాత్రల్లో పాల్గొన్నారు. పరిపాలనలో బిజీగా ఉన్న తండ్రి పనిలో లోకేష్ భాగం పంచుకుంటున్నారు.

అయితే ఈ సందర్భంగా లోకేష్‌ పై టీడీపీలోని ఓ వ‌ర్గం విప‌రీత‌మైన అంచ‌నాల‌తో ముందుకు వెళుతోంది. లోకేష్ ద్వారా త‌మ ప‌నులు చేయించుకోవాల‌ని భావిస్తున్న స‌ద‌రు నేత‌లు కొత్త కొత్త డిమాండ్లు తెస్తున్నార‌ని అంటున్నారు. లోకేష్‌ ను మంత్రిగా నియ‌మించాలని, తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరుతుండ‌టంలో మ‌ర్మం ఇదేన‌ని చెప్తున్నారు. లోకేష్ మంత్రి అవ‌డం ద్వారా ఆయ‌న ప‌లుకుబ‌డితో ప‌నులు నెర‌వేర్చుకోవ‌చ్చున‌ని కొంద‌రు నేత‌లు భావిస్తున్నారట‌.

చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు వెళితే అన్నీ బేరీజు వేసుకొని నిర్ణ‌యం తీసుకుంటార‌ని..లోకేష్ అయితే సీనియ‌ర్లు అని గౌర‌వించి ప‌నులు చేస్తారు కాబ‌ట్టి ఎంచక్కా సొంత అవ‌స‌రాలు తీర్చుకోవ‌చ్చున‌ని భావిస్తున్నారు. అదే క్ర‌మంలో తెలంగాణ భాధ్య‌త‌లు అప్ప‌గిస్తే...ఏపీలో నేరుగా త‌మ ప్రాబ‌ల్యం చూపించుకోవ‌చ్చున‌ని, తెలంగాణ‌లో పార్టీకి వైభ‌వం తీసుకువ‌చ్చే బిజీలో లోకేష్ ప‌డ‌టంతో ఆయ‌న‌ నిఘా నుంచి త‌ప్పించుకోవ‌చ్చున‌ని ఆలోచిస్తున్నార‌ట‌. మొత్తంగా నాయ‌కుడి ఎదుగుద‌ల‌తో సంబ‌ర‌పడాల్సింది పోయి కొందరు పార్టీ నేత‌లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని తెలుగుత‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.