Begin typing your search above and press return to search.

వైఎస్ జమానాను గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు

By:  Tupaki Desk   |   19 Nov 2016 1:30 AM GMT
వైఎస్ జమానాను గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు
X
కొద్దిరోజులుగా టీడీపీ నేతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి జమానా గుర్తుకొస్తోందట. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం పనితీరు చూశాక అప్పటి రోజులను వారు గుర్తు చేసుకుంటున్నారట. ముఖ్యమంత్రి కార్యాలయ ఐఏఎస్‌ లు (సీఎంఓ) పార్టీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం లేదని, తమకంటే సూటుబూటు వేసుకున్న వారికే రెడ్‌ కార్పెట్ వేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదంటున్న నేతలు పేషీ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కష్టమేనని స్పష్టం చేస్తున్నారు.

సీఎంఓను ప్రక్షాళన చేయాలన్న భావన టీడీపీలోని మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీఎంఓ కార్యాలయంలో కొందరు ఐఏఎస్ అధికారులు అనుసరిస్తోన్న నిర్లక్ష్యవైఖరి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని తెదేపా సీనియర్లు - మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు ఉదయం నుంచి రాత్రి వరకూ సమీక్షలు నిర్వహించి - పాలనను పరిగెత్తించి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తుంటే కొందరు అధికారులు నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలో చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.

వైఎస్ హయాంలో పనిచేసిన సీఎంఓనే ఇప్పటివరకూ అత్యుత్తమమని తెదేపా మంత్రులు - ఎమ్మెల్యేలు - నేతలే అంటున్నారు. ప్రజాప్రతినిధులు - నేతలకు గౌరవం ఇచ్చి వారి సమస్యలను వైఎస్ వరకూ వెళ్లకుండానే పరిష్కరించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం చెప్పిన పనులే కావడం లేదని, తాము అక్కడి అధికారులతో మాట్లాడటమే కష్టమైపోయిందని మంత్రులు సైతం వాపోతున్నారు. అధికారులు ఫోన్లు కూడా తీయడం లేదని, ఇది తమను అవమానించడమేనంటున్నారు. పరిశ్రమల స్థాపన - సలహాల కోసం వచ్చిన పారిశ్రామికవేత్తలను ఒక అధికారి పరుషపదజాలంతో దుర్భాషలాడుతున్నారని, పెద్దపెద్దగా వేస్తున్న కేకలు ఆయన చాంబర్ బయట వేచి ఉన్న పారిశ్రామికవేత్తలకూ వినిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఇంకో అధికారి మహిళలతో తప్ప మరెవరితోనూ ఎక్కువ మాట్లాడడం లేదని ఆ టైపు ఆరోపణలు కూడా చేస్తున్నారు టీడీపీ నేతలు. మరి చంద్రబాబుకు దీనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో.. మొత్తానికి టీడీపీ నేతలు వైఎస్ కాలం నాటి సీఎంఓనే బాగుందంటున్నారు.. మరికొన్నాళ్లు పోతే చంద్రబాబు కంటే వైఎస్సే నయమని కూడా అంటారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/