Begin typing your search above and press return to search.

ఏపీకి రూ.ల‌క్ష కోట్ల రోడ్ల అస‌లు లెక్క ఇదే!

By:  Tupaki Desk   |   12 Feb 2018 4:39 AM GMT
ఏపీకి రూ.ల‌క్ష కోట్ల రోడ్ల అస‌లు లెక్క ఇదే!
X
ఏపీకి మోడీ స‌ర్కార్ ఏం చేయ‌లేద‌న్న విష‌యం ఏపీ నేత‌లు మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ అంద‌రికి తెలిసిందే. కానీ.. ఏపీ బీజేపీ నేత‌లు ఇందుకు మిన‌హాయింపు. పేరుకు ఆంధ్రోళ్లే అయినా.. ఏపీ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు అస్స‌లు ప‌ట్ట‌ని వారిగా చెప్పుకోవాల్సిందే. నిత్యం మోడీ.. షాల భ‌జ‌న చేసేందుకే వారికి స‌మ‌యం స‌రిపోతుంది త‌ప్ప‌.. సొంత ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు అస్స‌లు పట్ట‌వు.

మిగిలిన రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌ల‌కు తొలుత త‌మ సొంత ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల త‌ర్వాతే పార్టీ అయినా.. పార్టీ ముఖ్యులైనా. కానీ.. ఆంధ్రా ప్రాంత బీజేపీ నేత‌లు మాత్రం ఇందుకు మిన‌హాయింపు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ మోడీని కీర్తించ‌టం.. వారు చెప్పే మాట‌ల్ని అదే ప‌నిగా వ‌ల్లె వేయ‌టం మిన‌హా మ‌రింకేమీ చేయ‌ర‌ని చెప్పాలి.

ఏపీకి ఏం చేయ‌లేద‌న్న మాట వ‌చ్చిన ప్ర‌తిసారీ.. రివ‌ర్స్ గేర్ లో ఏపీకి రూ.ల‌క్ష కోట్ల విలువ చేసే రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన‌ట్లుగా చెబుతుంటారు. జాతీయ ర‌హ‌దారుల కోసం ల‌క్ష కోట్ల రూపాయిలు ఇవ్వ‌లేదా? అన్న క్వ‌శ్చ‌న్ వేసి ఏపీ ప్ర‌జ‌ల్ని క‌న్ఫ్యూజ్ చేయ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా ఈ వాద‌న మీద తెలుగు త‌మ్ముళ్లు రియాక్ట్ అయ్యారు. రోడ్ల‌కు ల‌క్ష కోట్ల రూపాయిల లెక్క తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. దాని కింద ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రానికి వ‌చ్చిన నిధుల లెక్క‌తో పాటు.. ఈ ప్రాజెక్టుతో ఏయే రాష్ట్రాల‌కు సంబంధం ఉంద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పారు. వివిధ రాష్ట్రాలతో క‌లిపి ఇచ్చిన నిధుల్ని.. ఏపీ ఖాతాలోకి వేసేసే బీజేపీ నేత‌ల చావు తెలివితేట‌ల గుట్టు విప్పారు తెలుగు త‌మ్ముళ్లు.

రాష్ట్రానికి సాయం చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్న బీజేపీ జాతీయ స్థాయి నేత‌లు ఎత్తులు వేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేత‌లు.. అంకెల గార‌డీ చేస్తున్నార‌ని ఆరోపించ‌ట‌మే కాదు. రూ.ల‌క్ష కోట్ల లెక్క‌పై క్లారిటీ ఇచ్చారు. మూడేళ్ల వ్య‌వ‌ధిలో రోడ్ల కోసం ఏపీకి కేంద్రం ఇచ్చింది కేవ‌లం రూ.5900 కోట్లు మాత్ర‌మే. అంతేనా.. ఈ మొత్తం కూడా కేంద్రం జేబులో నుంచి ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప‌బ్లిక్- ప్రైవేట్ భాగ‌స్వామ్యం ప్రాజెక్టుగా దీన్ని చెప్పాలి.

టోల్ రోడ్ల రూపంలో నిర్మిస్తున్న ఈ జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టులో క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. మ‌హారాష్ట్ర ఇలా ప్ర‌తి రాష్ట్రానికి ఇచ్చిన‌ట్లుగా తేల్చారు. ఇక‌.. ప్ర‌ధాన‌మంత్రి అవాస్ యోజ‌న ప‌థ‌కం కింద రూ.7952 కోట్లు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్న‌ప్పటికీ వాస్త‌వంగా ఇచ్చింది రూ.1038 కోట్లు మాత్ర‌మే. ప్ర‌ధాన‌మంత్రి అవాస్ యోజ‌న ప‌థ‌కాన్ని దేశం మొత్తానికి ఇవ్వ‌గా.. అవ‌న్నీ మ‌న రాష్ట్రానికే ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌టాన్ని గుర్తు చేశారు.

ప్ర‌త్యేక హోదాతో స‌మానంగా అన్నీ చేస్తామంటూ ప్యాకేజీని తెర మీద‌కు తీసుకొచ్చిన వైనంలో చూస్తే.. ప్యాకేజీలో భాగంగా ఏపీకి రావాల్సింది రూ.16,447 కోట్లు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇచ్చింది కేవ‌లం రూ.400 కోట్లు మాత్ర‌మేన‌ని చెప్పారు. విభ‌జ‌న సంద‌ర్భంగా త‌యారు చేసిన చ‌ట్టంలోని 19 హామీలు.. నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ హామీ ఇచ్చిన ఆరు హామీల్ని అమ‌లు చేశారా? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీకి అన్యాయం జ‌రిగింద‌న్న మాట‌ను సోద‌ర తెలంగాణ రాష్ట్ర ఎంపీలు మొద‌లు జాతీయ స్థాయిలో ప‌లు పార్టీలు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ బీజేపీకి మాత్ర‌మే చాలా చేసిన‌ట్లుగా న‌మ్మ‌బ‌లుకుతోంద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏమిటంటే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీలోని జాతీయ స్థాయి నేత‌లుకొంద‌రు ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని.. త‌మ పార్టీ ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌టంలో మాట నిల‌బెట్టుకోవ‌టం లేద‌న్న మాట‌ను ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.