Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో టీడీపీ నేత‌ల పాట్లు చూశారా?

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:38 AM GMT
నంద్యాల‌లో టీడీపీ నేత‌ల పాట్లు చూశారా?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి ప్ర‌చారం పూర్తి కాగా... నేటి ఉద‌యం పోలింగ్ కూడా ప్రారంభ‌మైపోయింది. అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీలు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప‌రిగ‌ణిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి ప్ర‌త్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాల‌ని ఇరు ప‌క్షాలు కూడా స‌ర్వ శ‌క్తుల‌నూ ఒడ్డాయి. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన ప‌క్షం రోజులుగా అక్క‌డ ప్ర‌చారం హోరెత్తిపోయింది. అధికార పార్టీ హోదాలో టీడీపీ పెద్ద సంఖ్య‌లో మంత్రులు - ఇత‌ర జిల్లాల ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దించి... నంద్యాలను చుట్టేసింది. ఇక విప‌క్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మొక్క‌వోని దీక్ష‌తో ప్ర‌చారం గ‌డువు ముగిసే దాకా నంద్యాల‌లోనే ఉన్నారు.

అయితే విప‌క్ష పార్టీ నేత‌గా త‌న ప‌రిమితులేమిటో గుర్తించుకున్న జ‌గ‌న్‌... ప్ర‌చార ప‌ర్వం ముగియ‌గానే త‌న మందీ మార్బ‌లంతో నంద్యాల‌ను వీడి వెళ్లిపోయారు. ప‌ది రోజుల‌కు పైగా నిర్వ‌హించిన ప్ర‌చారంలో జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు ప్ర‌తి ఓట‌రు ఇంటి తలుపు త‌ట్టార‌ట‌. ఈ క్ర‌మంలో ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట‌రు నాడి ఒక్క‌సారిగా మారిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు అండ్ కో... చాలా వేగంగానే స్పందించింద‌ట‌. ఎలాగూ అధికారం చేతిలో లేని జ‌గ‌న్‌... ప్ర‌చారం గ‌డువు ముగియ‌గానే నంద్యాల వీడి వెళ్లిపోక త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో ప్ర‌చార గ‌డువు ముగిసిన క్ష‌ణం నుంచి పోలింగ్ ప్రారంభ‌మయ్యే వ‌ర‌కు ఉన్న స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టీడీపీ యోచించింద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు మొన్న‌టిదాకా నంద్యాల‌లోనే ఉన్న మంత్రులు ఆదినారాయ‌ణ‌రెడ్డి - అమ‌ర్ నాథ్ రెడ్డి - సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిలు ఇంకా నంద్యాల‌ను వీడ‌లేద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్ర‌చారం గ‌డువు ముగిసిన త‌ర్వాత స్థానికేత‌రులు నంద్యాల‌లో ఉండ‌టం చ‌ట్ట‌విరుద్ధ‌మే. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాలేమో... అక్క‌డి నుంచి క‌ద‌లొద్ద‌ని చెప్పేశాయి. ఈ క్ర‌మంలో నంద్యాల‌ను వీడి బ‌య‌ట‌కు వెళ్లలేక‌, నంద్యాల‌లోనే బ‌హిరంగంగా తిర‌గ‌లేక మంత్రుల‌తో పాటు ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు - ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు నానా పాట్లు ప‌డుతున్నార‌ట‌. ఎక్క‌డికక్క‌డ వైసీపీ నేత‌లు టీడీపీ నేత‌ల క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచ‌డం, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్న త‌రుణంలో వైసీపీ నేత‌ల కంట‌బ‌డ‌కుండా ఉండేందుకు టీడీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నార‌ట‌. పార్టీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కీల‌క భూమిక పోషిస్తున్న వ‌ర్ల రామ‌య్య అయితే... చీక‌టి ప‌డే దాకా అస‌లు బ‌య‌ట‌కే రాలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి అప్ప‌టిదాకా ఏం చేయాల‌ని భావించిన ఆయ‌న ఏకంగా సినిమా హాలులో ప్ర‌త్య‌క్ష‌మైపోయార‌ట‌.

ఇక మంత్రులు సోమిరెడ్డి - ఆదినారాయ‌ణ‌రెడ్డి - అమ‌ర్ నాథ్ రెడ్డి త‌మ కార్ల‌కున్న నెంబ‌రు ప్లేట్లను తీసివేయించి నంద్యాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ట‌. అయితే తాము ఇలా తిరుగుతున్న విష‌యం ఎలాగూ పోలీసుల‌కు తెలుసున‌ని, త‌మ కార్ల‌కు వైసీపీ నేత‌లు ఎదురుప‌డితేనే ఇబ్బంది అని పీల‌వుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో నెంబ‌రు ప్లేట్లు లేని కార్ల‌లో తిరుగుతున్నా... వారు క్ష‌ణ‌క్ష‌ణం భ‌యంభ‌యంగానే క‌దులుతున్నార‌ట‌. ఇక నంద్యాల డ్యూటీలో త‌రించిపోతున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు - బోడె ప్ర‌సాద్ లు నెంబ‌రు ప్లేట్లు ఉన్న కార్ల‌లోనే యథేచ్ఛ‌గా తిరుగుతూ... నంద్యాల మంత్రాంగం న‌డిచే ఆ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం బ‌న‌గాన‌ప‌ల్లెలో ప్ర‌త్య‌క్ష‌మైన వైనం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.