Begin typing your search above and press return to search.

లోకేశ్ కోసం....మంత్రులు క్యూ క‌ట్టారు

By:  Tupaki Desk   |   6 April 2016 12:14 PM GMT
లోకేశ్ కోసం....మంత్రులు క్యూ క‌ట్టారు
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంపై తెలుగుదేశం నేత‌లు ఇపుడు త‌మ ఆకాంక్ష‌ల‌ను వెలిబుచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు లోకేశ్‌ కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌గా...ఇపుడు ఆ వ‌రుస‌లో రాష్ట్ర మంత్రులు వ‌చ్చిచేరారు. లోకేశ్ అమాత్య ప‌ద‌వి గురించి తాజాగా మాట్లాడిన మంత్రులు - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీల వ్యాఖ్య‌లివి.

- ఏపీ మంత్రివ‌ర్గంలోకి లోకేశ్‌ ను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌ను స్వాగతిస్తున్నానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. లోకేశ్‌ కు మంత్రివర్గంలో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్‌ లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు.

- నారా లోకేశ్‌ ను మంత్రివర్గంలో తీసుకోవడంలో తప్పు లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఈ రోజు ప్రత్తిపాటి సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తెలుగుదేశానికి భవిష్యత్‌ నాయకుడిగా లోకేశ్‌ కు అర్హతలున్నాయని పేర్కొన్నారు.

- ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నారా లోకేశ్‌ కు బాధ్యతలు అవసరమని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో కృష్ణా బీసీ సెల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ కు మంత్రి పదవి ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. బీసీలకు అండగా నిలచే నాయకుడు లోకేశ్‌ అన్నారు. నాడు ఎన్టీఆర్‌ కు అండగా చంద్రబాబు యువనాయకత్వం ఎంతో పనిచేసిందన్నారు. బీసీలంతా లోకేశ్‌ మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.

-లోకేశ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది మైనార్టీల ఆకాంక్ష అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న - వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వారు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఆయన చేరికతో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని చెప్పామన్నారు. తమ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.