Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వాయిదా.. క్రెడిట్ కోసం టీడీపీలో పోటీ!

By:  Tupaki Desk   |   17 March 2020 2:30 AM GMT
ఎన్నిక‌ల వాయిదా.. క్రెడిట్ కోసం టీడీపీలో పోటీ!
X
ఒక‌వైపు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడి క‌నుస‌న్న‌ల్లోనే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేశ్ కుమార్ ప‌నిచేస్తూ ఉన్నార‌ని, చంద్ర‌బాబు నాయుడి నుంచి వ‌చ్చిన ఆదేశాల అనుసార‌మే స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డుతున్నాయ‌ని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు చంద్ర‌బాబు నాయుడుకు మ‌ధ్య‌న కులానుబంధం ఉంద‌ని కూడా వైసీపీ నేత‌లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ సంగ‌త‌లా ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల వాయిదా విష‌యంలో తెలుగుదేశం పార్టీలో క్రెడిట్ కోసం పోటీ కొన‌సాగుతూ ఉన్న‌ట్టుంది. త‌మ వ‌ల్ల‌నే ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్ర‌క‌టించుకుంటూ ఉండ‌ట‌మే ఈ ప‌రిస్థితికి నిద‌ర్శ‌నం.

ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పిన వెంటనే టీడీపీ నేతలు కొంద‌రు ప్రెస్‌మీట్లు పెట్టి సైతం తమ వల్లే ఎన్నికలు వాయిదాపడ్డాయని చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ముందున్నారు. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఆయ‌న ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించుకున్నారు. తాము కోరిన మేర‌కే ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఆ నిర్ణ‌యం తీసుకున్నారంటూ క్రెడిట్ పొందే ప్ర‌య‌త్నం చేశారాయ‌న‌.

ఇక టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి అయితే ఈ విష‌యంలో ట్వీట్ చేశారు. త‌ను ఫోన్ చేసి కోరినందునే ఈసీ ఎన్నిక‌లను వాయిదా వేసింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు! కోవిడ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా తాను మీడియా ద్వారా, వ్యక్తిగతంగా ఫోన్‌ ద్వారా కోరిన వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌కి ధన్యవాదాలు అంటూ ఆ మాజీ మంత్రి ట్వీట్ సైతం పెట్టారు!

మొత్తానికి తెలుగుదేశం నేత‌లు విజ‌యానందంలో ఉన్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం మాట ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల వాయిదానే త‌మ విజ‌యంగా భావిస్తూ ఉన్నారు. ఈ విష‌యంలో క్రెడిట్ కోసం పోటీ ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు!