Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..బాబుకు బెదిరింపులు షురూ

By:  Tupaki Desk   |   31 March 2017 6:33 AM GMT
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..బాబుకు బెదిరింపులు షురూ
X
సుదీర్ఘ కాలంలో చ‌ర్చ‌ల్లో ఉన్న‌ ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎట్ట‌కేల‌కు కొలిక్కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 2న కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారం ఉంటుందని టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పేసిన‌ట్లు దాదాపు అధికారిక వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అయితే ఒకింత గ్యాప్ త‌ర్వాత గ్రీన్ సిగ్న‌ల్ ద‌క్కిన ఈ ఎపిసోడ్ విష‌యంలో ఏపీకి చెందిన‌ కొంద‌రు మంత్రులు తీవ్ర అసంతృప్తిగా ఉన్న‌ట్లు చెప్తున్నారు. వారి అసంతృప్తి క‌ట్ట‌లు దాటి ఏకంగా బాబుకు హెచ్చ‌రిక‌లు పంపించిన‌ట్లు స‌మాచారం. మంత్రి వర్గం నుంచి తమను తప్పిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో, ప్రసార మద్యమాల్లో వార్తలు వస్తున్నాయని ఒక‌వేళ అలా జరిగితే తాము పార్టీకి గుడ్‌బై చెబుతామని పలువురు మంత్రులు ఇప్పటికే తమ అనుచరుల ద్వారా చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌నే వార్త‌ల నేప‌థ్యంలో బాబుకు ప‌రోక్షంగా హెచ్చ‌రించిన వారిలో కోస్తాకు చెందిన ఓ మంత్రితో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన మరో సీనియర్‌ మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో బాబు తీసుకోబోయే నిర్ణ‌యాల‌ను సైతం ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇరువురు మంత్రి వర్గంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రిలో ఒక‌రినే త‌ప్పిస్తార‌నే చ‌ర్చ వినిపిస్తోంది. తప్పిస్తే ఆ ఇద్దరిని తప్పించలే తప్ప సీఎం సామాజిక వర్గానికి చెందిన మంత్రిని కొనసాగించి దళిత మంత్రికి ఉద్వాసన పలికితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు నేత‌లు బాబుకు సూచించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లా నుంచి ఇరువురు మంత్రులను తప్పించి కొత్తగా మరో ఇద్దరికి స్థానం కల్పిస్తే ఎలా ఉంటుం దన్న విషయంపై చంద్రబాబు సమాలోచన జరుపుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జివి. ఆంజనేయులుకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదని వినిపిస్తోంది.

ఇలా బాబును హెచ్చరించే స్థాయికి నాయ‌కుల ఆగ్రహం చేరిన నేప‌థ్యంలో ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎవరినీ తొలగించకపోవచ్చని కొత్తగా ఆరు, ఏడు మందికి మాత్రమే చేర్చుకోవచ్చనే వాదనను తెలుగుదేశం వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది! ఇలాంటి సమాచారాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఏప్రిల్‌ 2వ తేదీ ఉదయం 9:25 నిమిషాలకు వ‌ర‌కు నూతన మంత్రులు కొలువు తీరనున్నారని ఎవరిని తప్పిస్తారో, కొత్తగా ఎవరినీ చేర్చుకుంటారో క్లారిటీ ఇవ్వ‌కుండా త‌న‌దైన శైలిని బాబు ఫాలో అవుతార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/