Begin typing your search above and press return to search.

జేసీ మాట వినొద్దు.. బాబుకు టీడీపీ నేతల వార్నింగ్!

By:  Tupaki Desk   |   16 March 2019 4:19 AM GMT
జేసీ మాట వినొద్దు.. బాబుకు టీడీపీ నేతల వార్నింగ్!
X
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలను పట్టించుకోవద్దని.. ఆయన మాటలకు పోయి అభ్యర్థులను మార్చవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ మేరకు బాబుకు వారు తమ తమ అభిప్రాయాలను తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే నాలుగు ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను మార్చాలని దివాకర్ రెడ్డి వాదిస్తూ ఉన్నారు.

అందుకోసం ప్రత్యామ్నాయ నేతలను కూడా రెడీ చేసి పెట్టారు జేసీ. అనంతపురం అర్బన్ - గుంతకల్ - శింగనమల - కల్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లకు తను చెప్పిన వారినే అభ్యర్థులుగా పెట్టాలని దివాకర్ రెడ్డి వాదిస్తూ ఉన్నారు. ఆ మేరకు అభ్యర్థిత్వాలకు నేతల పేర్లను కూడా జేసీ చెబుతున్నారు.

గుంతకల్ నుంచి మధుసూదన్ గుప్తాకు - శింగనమల నుంచి శ్రావణ శ్రీకి, అనంతపురం అర్బన్ ను సురేంద్రబాబుకు ఇవ్వాలనేది జేసీ వెర్షన్ - కల్యాణ్ దుర్గం సీటుకు కూడా క్యాండిడేట్ ను మార్చాలని అంటున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇందుకు ససేమేరా అంటున్నారు. జేసీ చెప్పినట్టల్లా అభ్యర్థులను మార్చేస్తే పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని వారు అంటున్నారు. ప్రత్యేకించి గుంతకల్ లో మధుసూదన్ గుప్తాకు టికెట్ ఇవ్వనే కూడదని వారు అంటున్నారు. బీసీ అభ్యర్థిని కాదని.. గుప్తాకు టికెట్ ఇస్తే జనాల్లోకి రాంగ్ ఇండికేషన్లు వెళ్తాయని వారు అంటున్నారు.

అనంతపురం ఎంపీ సీటు పరిధిలో కేవలం రాయదుర్గానికి తప్ప మరెక్కడా బీసీ అభ్యర్థి లేకుండా పోతాడని.. అసలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నుంచి బీసీ అభ్యర్థిని ఎంపీగా పోటీ చేయిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రాధాన్యం తగ్గిపోతే… మొదటికే మోసం వస్తుందని వారు వాదిస్తున్నట్టుగా సమాచారం. అటు జేసీకి ధీటుగా ఇటు మిగతా తెలుగుదేశం నేతలు కూడా ఢీ అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఏం తేలుస్తారో.. ఎటు వైపు మొగ్గుచూపుతారో!