Begin typing your search above and press return to search.

అన్ని క‌ళ్లూ.. గుడివాడ‌పైనే.. రీజ‌నేంటి..?

By:  Tupaki Desk   |   27 Jun 2022 1:35 PM GMT
అన్ని క‌ళ్లూ.. గుడివాడ‌పైనే.. రీజ‌నేంటి..?
X
ఇప్పుడు అన్ని క‌ళ్లూ.. అంద‌రి క‌ళ్లూ ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ‌పైనే ఉన్నాయి. ఎందుకంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలిసారి ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ పార్టీకి దిశానిర్దేశం చేయ‌నున్నారు. అయితే.. అంత‌కుమించి అన్న విధంగా ఇక్క‌డ చంద్ర‌బాబు ప్ర‌సంగం సాగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మాజీ మంత్రి, గుడివాడ నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న కొడాలి నానికి చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఎందుకంటే.. టీడీపీతో రాజ‌కీయాలు ప్రారంభించిన కొడాలి నాని.. చంద్ర‌బాబు చేతుల మీదుగా బీఫాం తీసుకున్న నాని.. త‌ర్వాత‌.. వైసీపీ అండ చూసుకుని.. చంద్ర‌బాబుపైనే చిందులు తొక్కారు. అన‌రాని మాట‌లు అన్నారు. ఇష్టానుసారంగా దూషించారు. త‌న‌కు తిరుగులేద‌ని.. చంద్ర‌బాబును అన‌లేని.. విన‌లేని మాట‌లు అన్నారు.దీనికితోడు టీడీపీని ఎద‌గ‌కుండా.. ఇక్క‌డ నాని వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నానికి ఎలాంటి హెచ్చ‌రిక చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

అంతేకాదు.. త‌ల‌కో ర‌కంగా ఉన్న టీడీపీ రాజ‌కీయాల‌ను.. నాయ‌కుల‌ను కూడా చంద్ర‌బాబు ఇక్క‌డ దారిలో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికి వ‌రుస ప‌రాజ‌యాల‌తో కుంగిపోయిన గుడివాడ టీడీపీలో కొత్త ర‌క్తాన్ని ఎక్కిస్తారా? లేక ఉన్న నాయ‌కుల‌నే దారిలో పెడ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో అనుభ‌వం నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కులు పార్టీకార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఎందుకంటే.. తాము క‌ష్ట‌ప‌డి పార్టీని నిర్మాణం చేయ‌డం.. కొడాలి నాని వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ఎదిరించి.. పార్టీని ఎదిగేలా చేయ‌డం వంటివి చేస్తున్నా.. చివ‌రి నిముషంలో వేరేవారికి .. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. దీంతో ఇక్క‌డి నాయ‌కులు గుంభ‌నంగా ఉన్నారు. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పుంజుకునే ప‌రిస్థితిపై అనేక సందేహాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు పర్య‌ట‌న‌కు, మినీ మ‌హానాడుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది.