Begin typing your search above and press return to search.

అడ్డదార్లు వెతుక్కుంటున్న బాబు అండ్ కో!

By:  Tupaki Desk   |   7 Aug 2017 6:23 PM GMT
అడ్డదార్లు వెతుక్కుంటున్న బాబు అండ్ కో!
X
‘‘మనం గెలవడం అంటే.. మనం జనం ఆదరణను సంపాదించుకుని విజయం సాధించడం మాత్రమే కాదు.. ప్రత్యర్థికి దక్కే ఓట్లు దక్కకుండా అడ్డదారుల్లో కోత పెడితే ఓడిస్తే చాలు.. అది కూడా మన గెలుపే అవుతుంది...’’ అనే వక్ర సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల బరిలో అనుసరిస్తోంది. జనం మనసుల్ని గెలుచుకుని, ఓట్లు పిండుకోవాల్సింది బదులుగా, ప్రత్యర్థిని ఓడించడం లక్ష్యంగా చిల్లర చవకబారు టెక్నిక్కులు, నేలబారు కుట్రలను వారు ప్రయోగిస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి వైకాపా తరఫున బరిలో ఉండగా.. ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు కనీసం కొన్ని ఓట్లనైనా తప్పుదోవ పట్టించేందుకు ‘మోహన్ రెడ్డి’ అనే పేరు గల మరో నలుగురితో కూడా నామినేషన్లు వేయించడం గమనిస్తే, తెలుగుదేశం వెతుక్కుంటున్న అడ్డదార్ల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.

నంద్యాల బరిలో ఉపఎన్నిక పోటాపోటీగా జరుగుతోంది. చాలా తక్కువ సంఖ్యలో ఓట్లను ప్రభావితం చేయగలిగినా కూడా విజయావకాశాలు మారిపోతాయనే ఉద్దేశంతో ఇరు పార్టీలు కూడా తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే తెలుగుదేశం వెతుక్కుంటున్న అడ్డదార్లు చాలా పాతకాలం నాటివి. అభ్యర్థి పేరుకే ఓటరు దృష్టిలో ప్రాధాన్యం ఉండి, గుర్తు గురించిన అవగాహన లేకపోయే పక్షంలో ప్రత్యర్థి పేరు ఉండే మరి కొందరితో నామినేషన్లు వేయించి.. ఓట్లు చీలిపోయేలా కుట్రలు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ.. ఇలాంటి ఎన్నికల పరిస్థితి వేరు.

ఎందుకంటే అసెంబ్లీ స్థాయి ఎన్నికలు పార్టీల ఇమేజి ప్రధానంగా జరుగుతాయి. ఓటర్లు అంతా దాదాపుగా.. సైకిలు, ఫ్యాను గుర్తులను గుర్తుంచుకుని ఓట్లు వేస్తారే తప్ప.. బ్రహ్మానందరెడ్డి - మోహన్ రెడ్డి పేర్లను చదువుకుని వాటి ఎదురుగా ఓట్లు వేయడం అనేది జరగని పని. అలాంటప్పుడు ఫ్యానుకు పడాల్సిన ఓట్లను డైవర్ట్ చేయడానికి మరికొందరు మోహన్ రెడ్డిలను బరిలోకి దించినంత మాత్రాన తెలుగుదేశం బావుకునే ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే.. తెదేపా నాయకుల ఆలోచన సరళి పాతకాలంలోనే ఆగిపోయందని మాత్రం అర్థమవుతోందని ప్రజలు అనుకుంటున్నారు.

ఇవాళ నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సమయానికి ఎన్నికల బరిలో 5కంటె ఎక్కువ మంది ‘మోహన్ రెడ్డి’ అనే పేరు గల వ్యక్తులు అభ్యర్థులుగా ఉన్నారు. తమాషా ఏంటంటే.. ఎన్నడో మరణించిన రాజా మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరిట కూడా తెలుగుదేశం వారు ఒక నామినేషన్ వేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. మోహన్ రెడ్డి అనే పేరుగల వ్యక్తి దొరికితే చాలు.. వారితో నంద్యాలలో ఓ నామినేషన్ వేయించడానికి తెదేపా ఆరాటపడినట్లుగా అర్థమవుతోంది.