Begin typing your search above and press return to search.

జగన్ అడ్డాపై బాబు గురి?

By:  Tupaki Desk   |   23 Sept 2015 11:00 PM IST
జగన్ అడ్డాపై బాబు గురి?
X
విపక్ష నేత వైఎస్ జగన్ కు ఊహించని షాక్ ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం అవుతున్నారా? ప్రత్యేక హోదా పేరుతో ఆందోళనలు చేస్తూ ఏపీ సర్కారుకు చికాకుగా మారిన జగన్ కు చిన్నపాటి ఝులక్ ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారా? తాజా పరిణామంతో జగన్ కు సొంత జిల్లాలోనే పట్టు లేదన్న భావన కలిగించే వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తమ పార్టీ నేతల్ని తెలంగాణ అధికారపక్షం ఆపరేషన్ ఆకర్ష్ తో లాగేసుకుంటుదని.. దుర్మార్గానికి పాల్పడుతుందని వాదించే తెలుగుదేశం.. తాను అధికారంలో ఉన్న ప్రాంతంలో.. అదే తీరును అమలు చేయటం గమనార్హం. తాజాగా జగన్ సొంత అడ్డా అయిన కడపకు చెందిన ఒక ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించేందుకు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

కడప జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ పై అసంతృప్తితో ఉన్నారు. తమను ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న భావనతో ఉన్న వారు.. అధికారపార్టీలో చేరేందుకు ఏడాది క్రితమే పావులు కదిపారు. ఈ విషయాన్ని గుర్తించిన జగన్.. వారు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసంతృప్తుతో ఉన్న వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారపక్షంలోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయినప్పటికీ.. అప్పటికున్న పరిస్థితుల్లో అలాంటివి సాధ్యం కాలేదు.

తాజాగా.. మరోమారు అధికారపక్షంలోకి వెళ్లేందుకు కడప జిల్లా ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. జగన్ దూకుడుకు బ్రేకులు వేయటంతో పాటు.. సొంత జిల్లాలోనే జగన్ కు పరపతి లేదని.. ఆయన పార్టీ నేతలు ఆయన మాట వినటం లేదన్న భావన కలిగించేందుకు తాజా చేరిక సాయం చేస్తుందని తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాము కానీ గేట్లు ఎత్తాలే కానీ.. తమ వద్దకు వచ్చేయటానికి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న భావన కలిగించేందుకు తాజా చేరిక ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జగన్ ఇలాకాకు చెందిన ఒకరు ఖాయంగా సైకిల్ ఎక్కుతారంటున్నారు. కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా భావించే నేత అధికారపార్టీ తీర్థం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా.. జగన్ కు సొంత జిల్లాలోనే షాకిచ్చేందుకు బాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది.