Begin typing your search above and press return to search.

మంత్రులందరూ ఓడిపోతారా? ఇదే హాట్ టాపిక్!

By:  Tupaki Desk   |   17 April 2019 2:30 PM GMT
మంత్రులందరూ ఓడిపోతారా? ఇదే హాట్ టాపిక్!
X
యాంటీ ఇంకంబెన్సీ సమయాల్లో ముందుగా ఓటమి పాలయ్యేది మంత్రులే. ఇది ఎన్నో ఎన్నికల ఫలితాల చరిత్ర చెబుతున్న విషయం. యాంటీ ఇంకంబెన్సీ బలంగా లేకపోయినా, అది స్వల్పంగానే ఉండినా.. మంత్రులుగా వ్యవహరించిన వారు చాలా మంది ఓడిపోయిన దాఖలాలున్నాయి. మంత్రి పదవి లో ఉన్నప్పుడు ఎంత మజా ఉంటోందో.. తీరా ఎన్నికలను ఎదుర్కొనేటప్పుడు అంతకు మించిన వేడి ఉంటుంది. చాలా మంది అనుభవపూర్వకంగా చెప్పే విషయం ఇది.

ఇలాంటి నేపథ్యంలో ఈ సారి కూడా ఏపీలో చాలా మంది మంత్రులకు ఎదురుగాలి వీస్తోందని టాక్. చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ - అమర్ నాథ్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి వీరు ముగ్గురూ ఓడిపోయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అది టీడీపీకి ఏ మాత్రం అనుకూలమైన ఎంపీ సీటు కాదు. ఇక అఖిలప్రియకు సొంత నియోజకవర్గంలో ఎదురుగా వీచిందని అంటున్నారు. అమర్ నాథ్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు అదే అని సమాచారం. సుజయకృష్ణ రంగారావు మాత్రం కొద్దో గొప్పో సేఫ్ జోన్లో ఉన్నారని అంచనా.

ఇక ఎమ్మెల్సీ మంత్రుల్లో.. నారా లోకేష్ - సోమిరెడ్డి - నారాయణలకు కూడా అంత తేలికగా లేని అంటున్నారు. నారాయణ భారీగా ఖర్చు పెట్టినా.. ఆఖర్లో పరిస్థితులు మారాయాని, నెల్లూరు సిటీలో అనిల్ యాదవ్ గాలి వీచిందని అంటున్నారు. సోమిరెడ్డి కి మరోసారి ఓటమే అనేటాక్ వినిపిస్తోంది. నారా లోకేష్ గెలుస్తారా? అనేది ఇంకా అనుమానంగానే ఉంది!

ఇక చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా బాగా హడావుడి చేసిన అచ్చెన్నాయుడుకు కూడా ఓటమి తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కొల్లు రవీంద్ర పరిస్థితి అంతంత మాత్రమే అని అంటున్నారు. మొత్తానికి బాబు కేబినెట్లో చాలా మందికి ఎదురుగాలి వీస్తోందని మొన్నటి వరకూ మంత్రులుగా అధికారం చలాయించిన చాలా మంది ఈ సారి ఎన్నికల్లో బోల్తా పడటం ఖాయమనే అంచనాలు ఏర్పడుతూ ఉన్నాయి. అసలు కథ ఏమిటనేది మే ఇరవై మూడున తేలాలి!