Begin typing your search above and press return to search.
అమ్మో! ప్రజాప్రతినిధి కారా? ప్రాణాలు జాగ్రత్త!
By: Tupaki Desk | 1 Sept 2018 7:31 PM ISTఏపీలో ప్రజాప్రతినిధుల వాహనాలు జనాలను బతకనివ్వడం లేదు. దీంతో ప్రజాప్రతినిధుల వాహనాలు కనిపిస్తే జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్కకు తప్పుకొంటున్నారు. ఎమ్మెల్యేలు - మంత్రుల కాన్వాయిలు తమని దాటిపోతే చాలు అనుకుంటున్నారు. వారం రోజుల్లోనే ఎమ్మెల్యేల కార్లు ఢీకొని ముగ్గురు చనిపోవడమే దీనికి తార్కాణం.
పెద్దపెద్ద కార్లలో తిరిగే ప్రజా ప్రతినిధులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ప్రజా ప్రతినిధుల కార్లు ఢీ కొని ముగ్గురు మరణించిన ఘటనలు ఏపీలో భయాందోళనలను కలిగిస్తుండగా ప్రజాప్రతినిధుల్లో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం కలిగించలేదని చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీ కొని మంగళగిరి హైవే పై ఒక మహిళా మృతి చెందగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వాహనం గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తల్ని ఢీ కొట్టడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. హాస్పిటల్ కి తరలిస్తుండగా మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె భర్త కూడా చనిపోయాడు. తాజాగా గూడవల్లి సమీపంలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు కారు ఒకరిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.