Begin typing your search above and press return to search.

ఓవైపు ఏపీ పోలీసుల అత్యుత్సాహం.. మరోవైపు తెలుగు తమ్ముడి ఓవారక్షన్

By:  Tupaki Desk   |   22 Nov 2021 7:30 AM GMT
ఓవైపు ఏపీ పోలీసుల అత్యుత్సాహం.. మరోవైపు తెలుగు తమ్ముడి ఓవారక్షన్
X
ఇద్దరూ ఇద్దరే. సరిపోయారన్నట్లుగా అనిపిస్తున్న తీరు ఏపీ ప్రజల పాలిట పెద్ద శిక్ష మారింది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఏపీ పోలీసుల మీద గడిచిన కొంతకాలంగా పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారపక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తారన్న పేరు పోలీసులకు గతంలోనూ ఉన్నప్పటికీ.. ఏపీలో ఇప్పుడది హద్దులు దాటిందన్న ఆరోపణ తరచూ వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే చోటు చేసుకునే పరిణామాలు ఈ తరహా వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

తాజాగా శ్రీకాకుళంలో చోటు చేసుకున్న పరిణామమే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం.. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం పార్టీ నేతలు పలు చోట్ల ఆందోళనలు.. నిరసనలు చేపట్టటం తెలిసిందే. దీనికి సంబంధించి శ్రీకాకుళంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అనుచరులతో కలిసి నిరసనకు దిగుతున్నట్లుగా తమకు సమాచారం అందినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

నిరసనను అడ్డుకోవటానికి శ్రీకాకుళం టూటౌన్ ఎస్ తన సిబ్బందితో కలిసి కూన ఇంటికి వెళ్లారు. ఇక్కడ పాయింట్ ఏమంటే.. కూన నిరసన చేస్తుంటే ఓకే. కానీ.. చేస్తారన్న సమాచారం అందటంతోనే సిబ్బందితో వెళ్లటంలో అర్థం లేదు. ఒకవేళ.. నిరసన చేస్తే.. వారి చేత విరమింపచేస్తే అయిపోయే దానికి.. చేయకుండానే హడావుడి చేయటంలో అర్థం లేదు. దీనికి తోడు.. సిబ్బంది కూన ఇంట్లోకి వెళ్లటం వివాదాస్పదమైంది. అయితే.. పోలీసులుమాత్రం కూన ఇంటి బయట ఉన్నామే తప్పించి.. లోపలకు వెళ్లలేదని చెబుతున్నారు.

కూన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను ఇంట్లోనే ఉండాలని.. శాంతిభద్రతల సమస్యను తీసుకురావొద్దని చెప్పారు. తాను నిరసన చేయకుండానే.. చేస్తానంటూ పోలీసులు తన ఇంట్లోకి వచ్చి హడావుడి చేయటంపై కూన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను, నీ ఉద్యోగం, నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్‌ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. ఒకసారి దురుసుగా తన చేతిని సీఐ భుజానికి తాకారు.

ఆగ్రహంతో కూన చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన సీఐ.. మీ ఇంట్లోకి ఎక్కడ వచ్చాం? రోడ్డుపైనే ఉన్నాం. మీ ఇంట్లోకి రావాల్సిన పని మాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తే.. అవసరం లేకున్నా హడావుడి చేయటం పోలీసుల తప్పు అయితే.. పోలీసులు తప్పు చేస్తుంటే.. సంయమనాన్ని వ్యవహరించాల్సింది పోయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇలాంటి ఉదంతాలతోనే అనవసరమైన రచ్చ జరగటమే కాదు.. కొత్త వివాదాలతో జనాలకు కొత్త తలనొప్పిగా మారుతోందని చెప్పాలి.