Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లోకి మ‌రో టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:54 PM GMT
టీఆర్ ఎస్‌ లోకి మ‌రో టీడీపీ ఎమ్మెల్యే
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ ల మీద షాక్‌ లు త‌గులుతున్నాయి. రెండ్రోజుల వ్య‌వ‌ధిలో పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ ఎర్రబెల్లి దయాకర్‌ రావు - ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ - మ‌రో ఎమ్మెల్యే వివేకానంద్ సైకిల్ దిగి కారు ఎక్కారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. మహబూబ్‌ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం టీఆర్‌ ఎస్‌ లో చేరారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన ఈ రాత్రి టీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు.

తెలంగాణలో టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇప్ప‌టికే తొమ్మిది మంది గులాబీ గూటికి చేరిపోయారు. తాజాగా రాజేంద‌ర్ రెడ్డి చేరిక‌తో ఆ సంఖ్య 10కి చేరింది. దీంతో మూడింట రెండొంతుల మంది ఆ పార్టీలో చేరినట్టయింది. ఈ ప‌రిణామం తెలంగాణ‌ టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ ఎస్‌ లో విలీనానికి మార్గం సుగమమైనట్టుగా అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో త‌మ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ ఎస్‌ లో క‌లిపేస్తున్న‌ట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌ కు లేఖ రాసే అవ‌కాశం ఉంది. త‌ద్వారా పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడబోదని భావిస్తున్నారు.

కొస‌మెరుపు ఏంటంటే... ఎన్టీఆర్ భవన్‌ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో జరిగిన టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో రాజేంద్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.