Begin typing your search above and press return to search.

బాబు పిలిచినా లైట్ తీస్కొన్న సీనియ‌ర్‌..జ‌గ‌న్‌ తో భేటీ!

By:  Tupaki Desk   |   5 Sep 2019 2:30 PM GMT
బాబు పిలిచినా లైట్ తీస్కొన్న సీనియ‌ర్‌..జ‌గ‌న్‌ తో భేటీ!
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ లు తగులుతున్నా యి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మాటను ఎవరు లెక్క చేయని పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు స్వయంగా పిలుస్తున్నా కీలక నేతలు ఎవరు ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు వివిధ జిల్లాలో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు, ఆయన వర్గం చంద్రబాబు తాజా పర్యటనకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు తోటను పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసిన ఆయన స్పందించలేదని తెలుస్తోంది ఇక తోట త్రిమూర్తులు త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని... ఆయన జగన్‌తో సమావేశమయ్యార‌ని తెలుస్తోంది.

తోట త్వరలోనే వైసీపీలోకి వెళతారని టిడిపి నేతలు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తోట త్రిమూర్తులు స్వయానా వియ్యంకులు. ఈ నేప‌థ్యంలోనే ఆయన ద్వారా తోట వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు రెండు రోజుల పర్యటనలో తొలిరోజు పార్టీ నేతలతో సమావేశమైనా తోట త్రిమూర్తులుతో పాటు ఆయన వర్గం హాజరు కాలేదు. చంద్రబాబు స్వయంగా పిలవడంతో తాను పార్టీకి దూరం కాలేదని.... పార్టీలోని కొందరు నేతలు వైఖరితో మనస్తాపానికి గురయ్యాన‌ని చెప్పినట్టు తెలిసింది.

వాస్తవానికి ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులు చంద్రబాబును కలిసి ఈ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వైసీపీలోకి వెళ్లే ఆలోచనలు కూడా చేశారు. తనకు రామచంద్రపురం సీటుతో పాటు తన కుమారుడికి కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు అడగడంతో జగన్ అందుకు ఒప్పుకోలేదు అన్న ప్రచారం జరిగింది. చివ‌ర‌కు టీడీపీ నుంచే పోటీ చేసిన తోట ఓడిపోయారు.

ఓట‌మి త‌ర్వాత తోట కాకినాడ‌లో టీడీపీ కాపు నేత‌ల‌తో ఓ స‌మావేశం ఏర్పాటు చేశారు. లోకేష్ వ‌ల్ల పార్టీలో కాపు నేత‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని... ఆర్థికంగా కూడా త‌మ వ‌ర్గానికి లోకేష్ సాయం చేయ‌లేద‌ని వారు తీర్మానించారు. లోకేష్ త‌మ వ‌ర్గానికి పెద్ద‌గా ప్ర‌యార్టీ ఇవ్వ‌లేద‌న్న సంకేతాలు కూడా ఈ స‌మావేశం ద్వారా కాపు నేత‌లు బ‌య‌ట‌కు పంపారు. ఇక కొద్ది రోజులుగా మౌనంగా ఉంటోన్న తోట టీడీపీకి లైఫ్ లేద‌ని డిసైడ్ అవ్వ‌డంతోనే వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్ల‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బాబు స‌మావేశానికి సైతం డుమ్మా కొట్ట‌డంతో పాటు సీఎం జ‌గ‌న్‌తో కూడా భేటీ అయిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తోట పార్టీ మార్పు వెన‌క సోద‌రుడు తోట న‌ర‌సింహంతో పాటు వియ్యంకుడు ఉద‌య‌భాను ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా ఉన్నాయ‌ని స‌మాచారం.