Begin typing your search above and press return to search.

ర‌గిలిపోయిన నేత‌లంతా బాబును ఏకేశారు

By:  Tupaki Desk   |   2 April 2017 3:51 PM GMT
ర‌గిలిపోయిన నేత‌లంతా బాబును ఏకేశారు
X
గంట‌ల వ్య‌వ‌ధిలో ఉల్లాసం కాస్తా ఉసూరుమ‌నించేలా మారింది. మ‌న‌మ‌డ్ని ప‌ట్టుకొని.. అంద‌రితో ముచ్చ‌ట్లు పెట్టుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆ కాసేప‌టికే చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఎందుకు పెట్టుకున్నానురా ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అన్న‌ట్లుగా ప‌రిస్థితులు మారాయి. ప‌ద‌వుల పంపిణీ జ‌రిపిన‌ప్పుడు ప‌ద‌వులు రాని వారు అసంతృప్తికి గురి కావ‌టం.. కినుకు వ‌హించ‌టం మామూలే. అయితే.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌రిపిన క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ వ్య‌వ‌హారం చూసిన‌ప్పుడు.. న‌మ్మినోళ్ల‌కు హ్యాండ్ ఇచ్చే విష‌యంలో చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అన్న పేరు ప్రఖ్యాతుల‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా ఉంద‌న్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. నమ్ముకున్న అధినేత.. తమను నిలువునా ముంచేశారని వారు మండిపడుతున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం.

అనంతపురం

సీనియర్ నేత పయ్యావుల కేశవ్.. పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథిలు తమకుమంత్రిపదవులు ఇవ్వలేదని గుస్సా ప్రదర్శిస్తున్నారు.

కడప

తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా జగన్ పార్టీ నుంచి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డికి మంత్రిపదవిని ఇవ్వటంపై రామసుబ్బారెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బాబు స్వయంగా చెప్పినా ఆయన కోపం తగ్గటం లేదంటున్నారు.

చిత్తూరు

మంత్రిగా ఉన్న జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి..తన మంత్రి పదవిపోకపోవటంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఆలేఖను పంపారు. బాబు నిర్ణయంపై ఆయన తీవ్రఆగ్రహంతో ఉన్నారు.

నెల్లూరు

తమకు మంత్రివర్గంలో చోటు దక్కకున్నా.. తమ వర్గ శత్రువైన సోమిరెడ్డికి పదవి లభించటంపై మిగిలిన తెలుగు తమ్ముళ్లు గుస్సా ప్రదర్శిస్తున్నారు.

గుంటూరు

2009 జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంత‌పెద్ద గుంటూరు జిల్లాలో ఒక్క‌టంటే ఒక్క అసెంబ్లీ స్థానం మాత్ర‌మే టీడీపీ గెలుచుకుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ ప‌రాజ‌యం పాలైతే.. కొంద‌రు పార్టీ కంటే వ్య‌క్తిగ‌తంగా త‌మ‌కున్న ఛ‌రిష్మాతో విజ‌యం సాధించారు. అలాంటి వారిలో ఒక‌రు ధూళిపాళ్ల న‌రేంద్ర‌. వైఎస్ హ‌యాంలో బాబు త‌ర‌ఫున వ‌క‌ల్తా పుచ్చుకొని.. నాటి వైఎస్ స‌ర్కారుపై తీవ్రంగా విరుచుకుప‌డిన అతి కొద్దిమంది ఎమ్మెల్యేల్లో న‌రేంద్ర ఒక‌రు.
అలాంటి సీనియ‌ర్ నేత‌కు పదేళ్ల త‌ర్వాత ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన బాబు స‌ర్కారులో మంత్రిగాస్థానం ద‌క్క‌లేదు. స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని చెప్పినప్ప‌టికీ.. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో మాత్రం ఆయ‌న‌కు ప‌ద‌వి ప‌క్కా అన్న మాట వినిపించింది. అయితే.. ఈసారీ ఆయ‌న‌కు చేయి ఇచ్చేసిన తీరుపై.. అక్క‌డి కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. న‌మ్మినోళ్ల‌ను న‌ట్టేట ముంచే తీరు బాబులో అణువ‌ణువునా ఉంటుంద‌న్న మాట‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు. బాబుకు వ్యతిరేకంగా నరేంద్ర మద్దతుదారులు గుంటూరు జిల్లా చింతలపూడిలో రాస్తారోకో చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు నరేంద్ర తన ఎమ్మెల్యే పదవికిరాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఉలిక్కిపడిన బాబు అండ్ కో.. నరేంద్రను బుజ్జగించే పనిలో బిజీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌ మోదుగుల వేణుగోపల్ రెడ్డికి క్యాబినెట్ లో స్థానం ద‌క్క‌లేదు. నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని.. ఎంపీగా ఉన్నా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని.. నాటి మంత్రి క‌న్నాపై గెలిస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని బాబు హామీ ఇచ్చార‌ని.. కానీ.. తాజా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లోనూ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌టంపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోలోన ఉడికిపోతున్నారు. ఆయ‌న మ‌న‌సులోని వాద‌న‌ను.. పార్టీ కార్య‌క‌ర్తలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. త‌మ నేత‌ను అధినేత మోసం చేశార‌ని ఫైర్ అవుతున్నారు. మోదుగులకు మంత్రిపదవి దక్కకపోవటంపై ఆయన ఇంటి వద్దకార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కృష్ణా

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తన వివాదాస్పద వైఖరితో తరచూవార్తల్లో నిలిచే బొండా ఉమామహేశ్వరరావు బుగ్గకారు మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అది నెరవేరకపోవటంతో ఆయన తీవ్ర ఆగ్రహం చెందారు. అసంతృప్తితో ఆయన చేసినవ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ కావటమే కాదు.. ఇంటికి పిలిపించుకొని మరీ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. తనకు మంత్రి పదవి రాకపోవటం కాపులకు జరిగిన అన్యాయంగా అభివర్ణించటంపై బాబు గుస్సా అయినట్లుగా తెలుస్తోంది.

తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికిరాజీనామా చేశారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటంతో కినుకు వహించిన ఆయన.. తీవ్ర ఆగ్రహంతో తన పార్టీ పదవికిరాజీనామా చేశారు.ఆయారాం.. గయారాంలకు పార్టీ కేంద్రంగా మారిందంటూ మండిపడ్డ ఆయన.. పార్టీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్టీని ఎటువైపునకు తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ విమర్శలు గుప్పించటం గమనార్హం. నీరు పోసి పెంచిన పార్టీఈ రోజు ఈ విధంగా మారడటం దురదృష్టకరంగా అభివర్ణించిన ఆయన తన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నట్లు పేర్కొన్నారు.

పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..తన ఎమ్మెల్యే పదవికి.. పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని ఆశించిన ఆయన.. అందుకు భిన్నంగా అధినేత నిర్ణయం తీసుకోవటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏలూరుజెడ్పీ గెస్ట్ హౌస్ లో పార్టీ కార్యకర్తలు..మద్దతుదారులతో కలిసి సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడినా ఫలితం దక్కలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు.అవసరమైతే కొత్త పార్టీ పెట్టేందుకు సైతం సిద్ధమన్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు మంత్రిపదవి దక్కటాన్ని చింతమనేని జీర్ణించుకోలేకపోతున్నారు.

విశాఖపట్నం

జిల్లాకు చెందిన వంగలపూడి అనిత.. బండారు సత్యానారాయణలు ఇద్దరూ మంత్రి పదవి కూడా ఆశపడ్డారు.సీనియర్ నేత అయిన బండారుకు మొదటి విడతలోనే మంత్రిపదవి వస్తుందని ఆశించారు.కానీ..అది జరగలేదు. ఇక..ఈ మధ్య కాలంలో విపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అనిత తాజా విస్తరణలో తనకు క్యాబినెట్ బెర్త్ ఖాయమని అనుకున్నారు. కానీ.. బాబు నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

విజయనగరం

ఈ జిల్లా నుంచి ఏడుసార్లు గెలిచిన పతివాడ నారాయణస్వామి (నెల్లిమర్ల)కి మొదట్లో స్పీకర్ పదవి ఇస్తామన్నారు. కానీ.. అది జరగలేదు. తాజావిస్తరణలో అయినా మంత్రిపదవి దక్కుతుందని ఆశించారు. కానీ.. ఆ ఆశ నెరవేరలేదు.

శ్రీకాకుళం

జిల్లాకు చెందిన ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యామ‌సుంద‌ర శివాజీ ఆవేద‌న అంతాఇంతా కాదు. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు.. మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌క‌పోవ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న తండ్రికి ఎందుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదో చెప్పాలంటూ ఆయ‌న కుమార్తె క‌మ్ శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్య‌క్షురాలు గౌతు శిరీష డిమాండ్ చేస్తున్నారు. పార్టీని న‌మ్ముకుంటే అన్యాయం చేస్తారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన ఆమె.. పార్టీ జిల్లా ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. న‌మ్ముకున్నోళ్ల‌కు అండ‌గా నిల‌వాల్సిన చంద్ర‌బాబు.. అందుకు భిన్నంగా మోసానికి క‌వ‌ల సోద‌రుడిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా.. సొంత పార్టీ నేత‌లు ప‌లువురు చెప్పుకోవ‌టం తాజా ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.