Begin typing your search above and press return to search.

బొబ్బిలి రాజుతో ఆ ముగ్గురి యుద్ధం

By:  Tupaki Desk   |   20 April 2017 7:57 AM GMT
బొబ్బిలి రాజుతో ఆ ముగ్గురి యుద్ధం
X
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మామూలుగా ఎమ్మెల్యేగానే ఉంటే ఏదోరకంగా నడిపించొచ్చు కానీ, ఫిరాయించిన తరువాత మంత్రి పదవి వస్తే అది మరింత కష్టం అన్నట్లుగా తయారైంది. జిల్లాలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ సాగాల్సి ఉంటుంది. కానీ... ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న నేతలు ఈ ఫిరాయింపు మంత్రులకు సహకరించడం లేదు. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాగే జరిగింది. భూగర్భ వనరులు - గనుల శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్‌.వి.సుజయ కృష్ణ రంగారావు తొలిసారిగా హాజరైన విజయనగరం జిల్లా పరిషత్తు సమావేశానికి అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. దీంతో, అధికార పార్టీలోని విభేదాలు, సుజయ కృష్ణపై అసమ్మతి మరోసారి బయట పడినట్లయింది.

విజయనగరం జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ను కాదని వైసిపి నుంచి వచ్చిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లాలోని కొందరు టిడిపి నాయకులు, ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి హోదాలో తొలిసారిగా సమావేశానికి వస్తున్న నేపథ్యంలో సుజయ కృష్ణ అనుచరులు బుధవారం భారీ స్వాగత ద్వారాలు జెడ్పీ వద్ద ఏర్పాటు చేశారు. జెడ్‌పి సమావేశం తేదీ ఖరారైన రోజు నుంచే సమావేశం ఎలా జరుగుతుందోన్న ఆసక్తికర చర్చ జిల్లాలోని రాజకీయ నాయకుల్లో సాగింది. అయితే... ఈ సమావేశాలకు ఐదుగురు ప్రజాప్రతినిధులు రాకపోవడం, వారంతా మంత్రివర్గ విస్తరణ సమయం లో సుజయ ను వ్యతిరేకించినవారే కావడంతో అంతర్గత కుమ్ములాటలు ఇంకా ఉన్నట్లు అర్థమవుతోంది.

గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు జెడ్పీ సమావేశాలకు రెగ్యులర్ గా వచ్చేవారు.. అంతేకాకుండా ఆయన సమావేశాల్లో కనీసం ఒక గంట మాట్లాడేవారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత కూడా గతంలో కనీసం గంటపాటైనా సమావేశంలో ఉండేవారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా విస్తరణలో మంత్రి పదవి ఆశించారు. వీరంతా ఇప్పుడీ సమావేశాలకు రాలేదు. వీరితోపాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్‌ కూడా డుమ్మా కొట్టేశారు.

కాగా వీరిలో కొందరు నిన్న వెలగపూడి సచివాలయానికి వెళ్లగా అక్కడ సీఎం చంద్రబాబు వీరికి క్లాస్ పీకారు. మీ జిల్లాలో మంత్రి ఆధ్వర్యంలో జడ్పీ సమావేశం జరుగుతుంటే ఇక్కడికెందుకు వచ్చారంటూ వారికి క్లాస్ పీకారు. దీంతో తమ గైర్హాజరుపై మంత్రి రంగారావే సీఎంకు వెంటనే ఉప్పందించి ఉంటారని వారంతా భావిస్తూ మరింత మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ ప్రజాప్రతినిధులు అయిదుగురు హాజరు కాకపోగా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం వచ్చారు. రావడమే కాకుండా కీలక సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/