Begin typing your search above and press return to search.

మోడీషా కుడిభుజంపై టీడీపీ నేత గెలుపు!

By:  Tupaki Desk   |   7 Aug 2018 6:31 AM GMT
మోడీషా కుడిభుజంపై టీడీపీ నేత గెలుపు!
X
తిరుగులేని అధికారాన్ని చేతిలో ఉంచుకొని ఏమైనా చేయ‌గ‌ల‌మ‌న్న ధీమాతో ఉండే మోడీ.. అమిత్ షాల‌కు దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. అమిత్ షా స్వ‌యంగా రంగంలోకి దిగి.. త‌న‌కు తానుగా వ‌చ్చి ఓటు వేసిన ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ప‌రాజ‌యం బీజేపీకి షాకింగ్ గా మారింది. విప‌క్షాల ఐక్య‌త మ‌రోసారి స్ప‌ష్టంగా వెల్ల‌డి కావ‌టంతో పాటు.. బీజేపీ ప‌వ‌ర్ కు చెక్ పెట్టేలా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది.

పార్ల‌మెంటులో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ స‌భ్యుల ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాలు ఏక‌మై.. మోడీషాల‌కు భారీ భంగ‌పాటుకు గుర‌య్యేలా చేశారు. విప‌క్షాల ఐక్య‌త పుణ్య‌మా అని టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ అత్య‌ధిక ఓట్ల‌ను సాధించ‌ట‌మే కాదు.. ఆయ‌న గెలుపు మోడీషాల‌కు భారీ షాక్ కు గురి చేసేలా చేసింది.

రాజ్య‌స‌భ‌లో కేవ‌లం ఆరుగురు స‌భ్యులే ఉన్న టీడీపీ త‌ర‌ఫు అభ్య‌ర్థి సీఎం ర‌మేశ్‌ కు ఏకంగా 106 ఓట్లు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార‌.. విప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. మోడీపై జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో ఏన్డీయే స‌ర్కారుకు అనుకూలంగా నిలిచిన అన్నాడీఎంకే సైతం మోడీషాల‌కు హ్యాండిస్తూ.. తెలుగు త‌మ్ముడికి ఓటు వేయ‌టం గ‌మ‌నార్హం. అన్నాడీఎంకేకుచెందిన 13 మంది స‌భ్యులు సీఎం ర‌మేశ్‌ కే ఓట్లు వేశారు.

పార్ల‌మెంటు పీఏసీకి చెందిన రెండు సీట్ల‌కుజ‌రిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌.. అన్నాడీఎంకే.. వామ‌ప‌క్షాలు.. టీఆర్ ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. బీజేడీకి చెందిన ఎంపీలంతా ర‌మేశ్ కు అండ‌గా నిల‌వ‌టంతో అత్య‌ధిక ఓట్లు ఆయ‌న సొంత‌మ‌య్యాయి. మోడీషాల‌కు అత్యంత స‌న్నిహితుడు.. కుడిభుజం లాంటి బీజేపీ అభ్య‌ర్థి భూపేంద్ర యాద‌వ్‌ కు కేవ‌లం 69 ఓట్లు మాత్ర‌మే రాగా.. సీఎం ర‌మేశ్‌ కు 106 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌.. బీజేపీ మ‌ద్ద‌తుతో బ‌రిలోకి దిగిన జేడీయూ అభ్య‌ర్థి హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌ కు కేవ‌లం 26 ఓట్లు వ‌చ్చి ఘోర‌మైన ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నారు.

సీఎం ర‌మేశ్ గెలుపు ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్‌ లో కొస‌మెరుపు ఏమిటంటే.. త‌మ అభ్య‌ర్థికి ఓట్లు వేయ‌టానికి బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌క్కాగా హాజ‌రు కావాల‌ని కోరినా.. న‌లుగురు స‌భ్యులు ఓట్లు వేయ‌టానికి రాక‌పోవ‌టం. త‌మ అభ్య‌ర్థి కోసం అమిత్ షా స్వ‌యంగా వ‌చ్చి ఓటు వేస్తే.. సీఎం ర‌మేశ్ కు ఓటు వేయ‌టం కోసం మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ వ‌చ్చి మ‌రీ ఓటేశారు. విపక్షాల ఐక్య‌త మోడీషాల‌కు మ‌రోసారి భారీ షాక్ ను ఇచ్చింద‌ని చెప్పాలి.