Begin typing your search above and press return to search.

కేసీఆర్ మా ముఖ్యమంత్రి అయితే బాగుండేది: జేసీ

By:  Tupaki Desk   |   21 Dec 2016 9:00 AM GMT
కేసీఆర్ మా ముఖ్యమంత్రి అయితే బాగుండేది: జేసీ
X
తన మాటలతో రాష్ట్ర రాజకీయాల్లో హడావుడి సృష్టించటమే కాదు.. యావత్ మీడియా మొత్తం తన మాటల్ని బ్రేకింగ్ న్యూస్ లుగా వేసుకునేలా చేస్తుంటారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయటమే కాదు.. ప్లేస్ ఏదైనా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడరు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ అధికారపక్షం నేతలతోనూ.. విపక్ష నేతలతోనూ విభజన సమయంలో తమ వాదనను వినిపించుకోలేదన్న నిష్ఠూరంతో పాటు.. మీరు సరిగా పోరాడటం లేదంటూ ముఖం మీదనే చెప్పేసే వైనం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.

ఈ రోజు(బుధవారం) ఉదయం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. టీడీఎల్పీ.. సీఎల్పీ.. టీఆర్ఎస్ ఎల్పీలకు వెళ్లి పలువురు నేతలతో ముచ్చటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లిన ఆయన సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో రాయలసీమకు చెందిన కర్నూలు.. అనంతపురం జిల్లాల్ని తెలంగాణలో కలుపుకోవాలని తాముచెబితే వినలేదు.. తమ మాటలు విని ఉంటే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే పవర్ లో ఉండేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ నేతలు సరిగా పోరాడటం లేదన్న వ్యాఖ్యను చేసిన జేసీ.. కాసేపు జోకులు కూడా వేశారు. అనంతం.. అసెంబ్లీ లాబీల్లో తనకు ఎదురైన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడారు. విభజనతో తమను అడువుల పాల్జేశారని వ్యాఖ్యానించిన జేసీ.. తమ రెండు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తమకు నీళ్లు సరిగా రావటం లేదన్నారు. దీనికి స్పందించిన ఈటెల శ్రీశైలం నుంచి నీళ్లు రావటం లేదా? అని అడిగారు. తెలంగాణలో ఉండి ఉంటే.. శ్రీశైలం నుంచి నీళ్లు ఎందుకు ఇవ్వరని మా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగేవారిమని.. ఏం మేం కూడా తెలంగాణ వాళ్లం కాదా? అని ప్రశ్నించే వాళ్లమని.. ఇప్పుడు ఇద్దరు సీఎంలను అడగాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఇలా.. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం జేసీకి మాత్రమే ఉంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/