Begin typing your search above and press return to search.

కొండ‌ప‌ల్లి కోట‌.. కేశినేని ఓటు స‌బబే!

By:  Tupaki Desk   |   12 Aug 2022 7:22 AM GMT
కొండ‌ప‌ల్లి కోట‌.. కేశినేని ఓటు స‌బబే!
X
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా విజ‌య‌వాడ‌ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తడాన్ని కొట్టేసింది. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కొనసాగేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్న వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల‌ వాదనను తిరస్కరించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే నాని ఓటు హక్కు వినియోగానికి అనుమతించిన హైకోర్టు ఫలితాన్ని వెల్లడించవద్దని చెప్పింది. ఇప్పుడు తాజాగా త‌న తుది నిర్ణయాన్ని వెలువరించింది.

కొండపల్లి మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు 14 వార్డులు గెలుచుకోగా ఒక వార్డు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ వార్డు మెంబర్ స‌హాయంతో మున్సిపాలిటీలో జెండా పాతేందుకు రెండు పార్టీలు ప్రయత్నించాయి. టీడీపీ చివరకు స్వతంత్ర అభ్యర్థి బ‌లంతో 15 మంది మ‌ద్దతు ద‌క్కించుకుంది. ఈ ప‌రిణామంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యత్వం పొందడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలం కూడా 15కు చేరింది.

దీంతో టీడీపీ అప్ర‌మ‌త్త‌మైంది. అప్రమత్తమైన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కొండపల్లి మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యత్వం తీసుకున్నారు. దీనిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎక్స్‌ అఫీషియో సభ్యత్వం కోసం కేశినేని నాని లేఖ ఇచ్చారని పేర్కొంది. అందువ‌ల్ల‌ కొండపల్లి మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో స‌భ్య‌త్వం కోసం ఆయన రాసిన లేఖ చెల్లదని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

దీంతో కేశినేని నాని త‌నకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న ఎక్స్ అఫీషియో స‌భ్య‌త్వాన్ని రద్దు చేసి కొండపల్లిలో సభ్యత్వం పొందేందుకు హైకోర్టుకు వెళ్లారు. ఈ మేర‌కు కొండ‌ప‌ల్లిలో ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా కొన‌సాగ‌డానికి కోర్టు అనుమ‌తి పొందారు. దీంతో మున్సిపాలిటీ చైర్మ‌న్ ప‌ద‌విని ఒక్క ఓటు తేడాతో టీడీపీ ద‌క్కించుకుంది.

అయితే కేశినేని ఓటును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొండపల్లికి మార్చడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది. ఈ మేర‌కు కోర్టును ఆశ్ర‌యించింది. అయితే కోర్టు వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల వాద‌న‌ను తిర‌స్క‌రించింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని, ప్రకటించవద్దని జిల్లా అధికారులను హైకోర్టు ఆదేశించింది.