Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఓటమికి పక్కా ప్లాన్...?

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 AM GMT
టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఓటమికి  పక్కా ప్లాన్...?
X
ఆయన దివంగత ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు. కుమారుడైన కింజరాపు రామ్మోహననాయుడు. తండ్రి కోటలో పాగా వేసి ఓటమెరుగని వీరుడిగా మారిపోయారు. 1996లో ఫస్ట్ టైమ్ శ్రీకాకుళం ఎంపీ సీటుకు టీడీపీ తరఫున కింజరాపు ఎర్రన్నాయుడు పోటీ చేసి గెలిచారు. అది లగాయితూ 1998, 1999, 2004లలో వరసగా గెలిచి తన సత్తా చాటారు. ఈ మధ్యలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి ఎర్రన్నాయుడు 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓడిపోయారు.

ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోయింది రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఒక మహిళా డాక్టర్ చేతిలో. ఆమె కిల్లి కృపారాణి. ఆమె వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండడంతో వైఎస్సార్ ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చారు. ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చారు. దాంతో కృపారాణి ఫస్ట్ టైమ్ ఎంపీ అయ్యారు. అది కూడా ఎర్రన్నాయుడి లాంటి బిగ్ షాట్ ని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఇక నాడు కేంద్రంలోని యూపీయే సర్కార్ లో కేంద్ర మంత్రిగా కూడా కిల్లి కృపారాణి పోటీ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

మంచి వక్తగా కూడా ఆమెకు పేరు. ఇక సామాజికవర్గ పరంగా చూస్తే ఆమె కాళింగ సామాజికవర్గానికి చెందిన వారు. శ్రీకాకుళం జిల్లాలో వారు అత్యధిక శాతం ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెకు రాజకీయంగా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. 2014లో ఆమె నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకురాలిగా ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు.

ఇక జగన్ ఆమె సేవలను కొన్నాళ్ళ పాటు పార్టీ కోసం వాడుకున్నారు. ఆమెను శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిని చేశారు. అయితే ఆమె రాజ్యసభ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఇవ్వలేదు. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. ఒక దశలో పార్టీని వీడిపోవాలన్న ఆలోచన కూడా చేశారన్న ప్రచారం సాగింది. అయితే పార్టీ హై కమాండ్ తమ మనసులో మాటను ఆమెకు చెప్పడంతో ఆమె మెత్తబడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఆమెను శ్రీకాకుళం నుంచి ఎంపీ సీటుకు పోటీకి పెట్టబోతున్నట్లుగా వైసీపీ హై కమాండ్ ఆమెకు తెలియచేసింది. ఇప్పటి నుంచే జనాలలో ఉండాలని కూడా కోరింది. ఇక తండ్రి వారసుడిగా రెండు సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచిన రామ్మోహనాయుడు మీద 2024 ఎన్నికల్లో కృపారాణి బరిలోకి దిగబోతున్నారు. బలమైన కాళింగ సామాజికవర్గం మద్దతు ఎటూ ఉంది. ఇక రెండు సార్లు రామోహన్ నాయుడు ఎంపీ కావడంతో మూడవసారి ఆ హవా కొనసాగిస్తారా అన్నది చూడాలి.

ఇక రామ్మోహన్ నాయుడు జగన్ కి బాగా టార్గెట్ అయ్యారని అంటున్నారు. ఆయన వైసీపీని గట్టిగా విమర్శిస్తారు. పైగా ఢిల్లీలో కూడా పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బలంగా ఉండడానికి కింజరాపు కుటుంబమే కారణం అని కూడా చెప్పాలి. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా ఈ ఫ్యామిలీ ఉంది. దాంతో ఆ ఫ్యామిలీనే ఓడించాలని జగన్ పధక రచన చేశారు. జిల్లాలో వైసీపీలోకి చేరికలకు కూడా తలుపులు తెరచారు. మొత్తానికి చూస్తే జగన్ పట్టుదలను కిల్లి రూపంలో అభ్యర్ధిగా పెట్టి జూనియర్ ఎర్రనాయుడుకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరి జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.