Begin typing your search above and press return to search.

నిర‌స‌నేమో కానీ యేషాలు అదిరిపోయాయ్‌

By:  Tupaki Desk   |   20 March 2018 2:45 PM GMT
నిర‌స‌నేమో కానీ యేషాలు అదిరిపోయాయ్‌
X
క‌ళాపోష‌ణ లేనిదెవ‌రికి. మ‌డిస‌న్నాక కాస్తంత క‌ళాపోష‌ణ ఉండాలి బాస్ అన్న‌ది అప్పుడెప్పుడో సూప‌ర్ హిట్ అయిన సినిమాలో ఫేమ‌స్ డైలాగ్‌. మ‌డిసిలో క‌ళాపోష‌ణ ఉన్నా.. దాన్ని ప్ర‌ద‌ర్శించాలంటే బోలెడంత ఖ‌లేజా ఉండాలి. అలాంటివి పుష్క‌లంగా ఉన్న నేత‌.. చిత్తూరుఎంపీ శివ‌ప్ర‌సాద్‌. ఒక పార్ల‌మెంటేరియ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌న నిర‌స‌న‌ను క‌ళాత్మ‌కంగా చెప్ప‌టం బాగానే ఉన్నా.. అది ప్ర‌చార‌మే త‌ప్పించి మ‌రి దేనికి ప‌నికి రాద‌న్న మాట అస్స‌లు ఉండ‌కూడ‌దు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు శివ‌ప్ర‌సాద్ వేషాలు ఏపీ హోదా సాధ‌నకు ఏ మాత్రం సాయం చేయ‌టం లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఇలాంటి వేషాలే వేసిన ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపుల‌ర్ అయ్యారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శివ‌ప్ర‌సాద్ విజ‌యంలో ఆయ‌న వేసిన వేషాలే కార‌ణంగా చెప్పాలి. విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేయ‌టంలో శివ‌ప్ర‌సాద్ తీరు అప్ప‌ట్లో చ‌ర్చ‌గా మారింది.

విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ త‌న వేషాల్ని బ‌య‌ట‌కు తీశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పై పోరాడాల‌న్న నిర్ణ‌యాన్ని పార్టీ అధినేత తీసుకున్న త‌ర్వాత శివ‌ప్ర‌సాద్ లోని క‌ళాకారుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. శ్రీ‌కృష్ణుడు.. ఒక తెలుగు మ‌హిళ‌.. తాజాగా స్కూల్ పిల్లాడిలా వేషాలు వేసుకొని పార్ల‌మెంటు ద‌గ్గ‌రున్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఆయ‌న‌.. మీడియాను తెగ ఆక‌ర్షిస్తున్నారు. ఇలా వేషాలు వేసుకొని నిర‌స‌న తెలిపే నేత‌లు చాలా త‌క్కువ‌. దీంతో.. ఫోటో గ్రాఫ‌ర్లు ఆయ‌న వేషాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో ప్ర‌ముఖంగా టెలికాస్ట్ చేస్తున్నారు.

అయితే.. శివ‌ప్ర‌సాద్ వేషాలు ఆయ‌న ప్ర‌చారానికే ప‌నికి వ‌స్తున్నాయి త‌ప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను ప్ర‌తిబింబించేలా ఉండ‌టం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తుంది. శివ‌ప్ర‌సాద్ వేషాల నిర‌స‌న‌ను కొంద‌రు లైట్ గా తీసుకుంటే.. మ‌రికొంద‌రు కామెడీగా తీసుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ నేప‌థ్యంలో.. చిత్తూరు ఎంపీ త‌న వేషాల మీద ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.