Begin typing your search above and press return to search.

ఆ ఎంపీకి అల్లుల్ల తలనొప్పి

By:  Tupaki Desk   |   28 Jan 2019 10:14 AM GMT
ఆ ఎంపీకి అల్లుల్ల తలనొప్పి
X
సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్లిన నేతలు చాలా మంది ఉన్నారు. అలా వెళ్లి కూడా సినిమాల్లో నటిస్తూ.. రాజకీయాల్లోనూ సినిమా చూపిస్తున్న ఎంపీగా శివప్రసాద్‌ పేరు పొందారు. ఇప్పుడు ఎంపీ మామకు కొత్త సమస్య వచ్చిపడింది. అదే అల్లుల్లతో తలనొప్పి.. . శివప్రసాద్‌ ను అల్లుల్లు అల్లాడిస్తున్నారట.. అమ్మో అల్లుల్లు అంటూ శివప్రసాద్‌ జడుసుకుంటున్నారు.. అయితే అల్లులతో వచ్చిన తలనొప్పేంటంటే..

టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అంటే తెలియని వారుండరు. సినిమాల్లో కంటే పార్లమెంట్‌ ముందు వివిధ గెటప్ లతో దేశవ్యాప్తంగా ఆయన ఫేమస్ అయ్యారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రకరకాల వేషాలు వేసి ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేత మెప్పు పొందారు. అలాంటి శివప్రసాద్‌ సొంత అల్లుల్ల కారణంగా ఇబ్బందులు పడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

శివప్రసాద్‌కు వేణు - నర్సింగ ప్రసాద్‌ అనే ఇద్దరు అల్లుల్లున్నారు.. వీరిలో పెద్దాయన వేణు. ఈయనకు కూడా సినిమాలంటే పిచ్చి. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో షార్ట్‌ఫిలింలో నటిస్తున్నాడు. ఆయన కూడా వివిధ గెటపుల్లో ఉన్న ప్లెక్సీలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటారు.

ఇక చిన్నల్లుడు నర్సింగ ప్రసాద్‌దీ అదే బాట. కళాపోషణకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు. షార్ట్‌ ఫిలింస్‌, ప్రైవేట్‌ ఆల్బమ్‌లో నటించడమే కాకుండా డ్యాన్సులు కూడా వేస్తారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆయన 'విన్నారా.. విన్నారా' అనే సాంగ్‌లో నటించి ఆకట్టుకున్నారు. దీంతో మామకు తోడుగా ఇద్దరు అల్లుల్లకు సినిమాలపై ఆసక్తి ఉండడంతో శివప్రసాద్‌ కూడా మొదట్లో సంతోషంలో మునిగిపోయారు.

ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడే మొదలైంది అసలు సమస్య. శివప్రసాద్‌ అల్లుల్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారట. శివప్రసాద్‌ గతంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచే మంత్రి కూడా అయ్యారు. ఆ సమయంలో మామకు అండగా నిలిచిన పెద్ద అల్లుడు వేణు ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి టికెట్‌ కావాలని కోరుతున్నాడట.

ఇక రెండో అల్లుడు నర్సింగ ప్రసాద్‌ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. చిత్తూరులోని రైల్వేకోడూర్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ కావాలని పట్టుబడుతున్నాడట. అయితే శివప్రసాద్‌ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీదనే విమర్శలు చేశారు. కానీ బాబు మాత్రం ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంపీ టికెట్ ఇచ్చి మరీ పార్లమెంట్ కు పంపారు.. ఇప్పుడు ఎంపీ టికెట్‌ విషయంలో శివప్రసాద్ కే గ్యారెంటీ లేకుండా ఉందట... తన టిక్కెట్‌ సంగతేమో గానీ ఇద్దరు అల్లుల్లకు అసెంబ్లీ టిక్కెట్‌ ఎలా ఇప్పించాలో తెలియక శివప్రసాద్ సతమతమవుతున్నాడట. ఒకవేళ అల్లుల్లకు సారీ అని చెబితే ఏమవుతుందోనని శివప్రసాద్‌ ఆందోళనలో పడ్డాడట.