Begin typing your search above and press return to search.

వేషాలరాయుడి ప్లాన్!... మామూలుగా లేదే!

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:17 PM GMT
వేషాలరాయుడి ప్లాన్!... మామూలుగా లేదే!
X
సినీ న‌టుడు - టీడీపీ సీనియ‌ర్ నేత‌ - చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్... ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉద్య‌మంలో లెక్క‌లేన‌న్ని వేషాలు వేశారు. కేంద్రానికి నిర‌స‌న తెలిపే క్ర‌మంలో ఆయ‌న త‌న‌కు గుర్తుకు వ‌చ్చిన దాదాపు అన్ని వేషాలు వేసేశారు. ఎన్ని వేషాలేసినా... ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించలేక‌పోయార‌ని - ఈ క్ర‌మంలో ఎంపీ శివ‌ప్ర‌సాద్ వేషాల‌రాయుడిగా త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించార‌ని వైరి వ‌ర్గాలు ఆయ‌న‌పై భారీ సెటైర్లే వేశాయి. పార్ల‌మెంటులో వేషాల‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన శివ‌ప్ర‌సాద్‌... ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌దైన శైలి మంత్రాంగంతో చిత్తూరు - క‌డ‌ప‌ జిల్లాల‌ టీడీపీ నేత‌ల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఒకానొక స‌మ‌యంలో త‌న‌కే సీటు ద‌క్క‌ద‌న్న స్థాయి నుంచి ఇప్పుడు త‌న‌కు టికెట్ తో పాటు త‌న ఇద్దరు అల్లుళ్ల‌కు కూడా టికెట్లు సాధించుకునేందుకు శివ‌ప్ర‌సాద్ నెర‌పుతున్న మంత్రాంగం మామూలుగా లేద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే త‌న చిన్న‌ల్లుడికి క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు టికెట్‌ ను సాధించేసుకున్న శివ‌ప్ర‌సాద్ త‌న పెద్ద‌ల్లుడికి స‌త్యవేడు టికెట్‌ ను సాధించేందుకు ప‌కడ్బందీ వ్యూహాన్నే అమ‌లు చేస్తున్నారు. ఈ వ్యూహం ఫ‌లిస్తే... టీడీపీలో సింగిల్ ఫ్యామిలీకి మూడు టికెట్లు సంపాదించుకున్న నేత‌గా శివ‌ప్ర‌సాద్ అరుదైన ఘ‌న‌త‌నే న‌మోదు చేసే అవ‌కాశాలున్నాయి.

ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ గా ఉన్న చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి శివ‌ప్ర‌సాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ ద‌ఫా కూడా ఆ టికెట్ దాదాపుగా ఆయ‌న‌కే కేటాయిస్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. శివ‌ప్ర‌సాద్ మిన‌హా అక్క‌డ పెద్ద‌గా ప్ర‌త్యామ్నాయం కూడా లేద‌నే చెప్పాలి. సో... చిత్తూరు ఎంపీ టికెట్ ద్వారా త‌న‌ను తాను సేఫ్ జోన్ ప‌డేసుకున్న శివ‌ప్ర‌సాద్‌... గుట్టుచ‌ప్పుడు కాకుండా నెర‌పిన మంత్రాంగం ద్వారా త‌న చిన్న‌ల్లుడు న‌ర‌సింహ ప్ర‌సాద్ టీడీపీ టికెట్ ను క‌న్ ఫామ్ చేయించేశారు. నిన్న క‌డ‌ప జిల్లాలోని ప‌లు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ఆ జాబితాలో న‌ర‌సింహ ప్ర‌సాద్ పేరును కూడా ప్ర‌స్తావించారు. ఇక్క‌డితో రెండు టికెట్ల‌ను త‌న బుట్ట‌లో వేసేసుకున్న శివ‌ప్ర‌సాద్‌... ఇక మూడో టికెట్ కోసం ఇంకో వ్యూహానికి తెర తీశారు. ఈ సారి నేరుగా తాను కాకుండా త‌న పెద్ద‌ల్లుడినే ఆయ‌న రంగంలోకి దించారు. టాలీవుడ్ లో నిర్మాత‌గా ఒకింత గుర్తింపు సంపాదించిన గుంతాటి వేణుగోపాల్ ఈ రోజు చంద్ర‌బాబును క‌లిశారు. తాను ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్నాన‌ని, త‌మ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయిన స‌త్య‌వేడు నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆయ‌న చంద్రబాబును కోరారు.

ఈ సంద‌ర్భంగా త‌న బ‌యోడేటాను చంద్ర‌బాబు ముందుంచిన వేణు... సినీ నిర్మాత‌గానే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ త‌న‌కు చాలా అనుభ‌వం ఉంద‌ని తెలిపార‌ట‌. రాజ‌కీయాల్లోకి రావ‌డం ద్వారా మ‌రింత మేర ప్ర‌జా సేవ చేయొచ్చ‌న్న భావ‌న‌తోనే ఇప్పుడు స‌త్య‌వేడు నుంచి పోటీ చేయాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న‌కు పార్టీ టికెట్ ఇస్తే... ప్ర‌జా సేవ‌లో త‌రిస్తాన‌ని, పార్టీకి మంచి మంచి పేరు తీసుకువ‌స్తాన‌ని కూడా చెప్పార‌ట‌. వేణుకు చంద్ర‌బాబు నుంచి హామీ ల‌భించిందో, లేదో తెలియ‌దు గానీ... ఒక‌వేళ వేణుకు టికెట్ ల‌బిస్తే మాత్రం శివప్ర‌సాద్ ఫ్యామిలీకి ఏకంగా మూడు టికెట్లు ద‌క్కిన‌ట్టే లెక్క‌. అయితే స‌త్య‌వేడులో ఇప్పుడు టీడీపీ యువ నేత త‌లారి ఆదిత్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మ‌రి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని వేణుకు చంద్ర‌బాబు టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అన్న‌ది తేలాల్సి ఉంది.