Begin typing your search above and press return to search.

వైసీపీలోకి టీడీపీ ఎంపీ..ముహూర్త‌మే మిగిలుంది!

By:  Tupaki Desk   |   15 April 2017 11:54 AM GMT
వైసీపీలోకి టీడీపీ ఎంపీ..ముహూర్త‌మే మిగిలుంది!
X
నిజ‌మే... మొన్న‌టిదాకా తెలుగు రాష్ట్రాల్లో విప‌క్ష పార్టీల టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు అధికార పార్టీలోకి మారిపోయారు. పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని తుంగ‌లో తొక్కేసిన అధికార పార్టీలు ఎంత‌మంది వ‌స్తే... అంత‌మంది విప‌క్ష పార్టీల ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు త‌మ కండువాలు క‌ప్పేశాయి. ఎన్న‌డూ లేని విధంగా విప‌క్ష పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులను కూడా క‌ట్ట‌బెట్టాయి. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఎలా ఉన్నా... ఇప్పుడు న‌వ్యాంధ్ర‌లో స‌రికొత్త రాజ‌కీయానికి తెర లేసింది. వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన 21 మంది ఎమ్మెల్యేల‌ను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట టీడీపీలోకి లాగేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... వారిలో ఇటీవ‌లే న‌లుగురికి కేబినెట్ బెర్తులు కూడా క‌ట్ట‌బెట్టేశారు. దీనిపై విప‌క్షం వైసీపీ జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రిగేలా ప‌క్కాగానే పావులు క‌దిపింది.

మొన్న ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర‌ప‌తి స‌హా ప‌లు జాతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ అవాకులు చెవాకులు పేలుతున్న త‌రుణంలో ఆ పార్టీకి పెద్ద దెబ్బే ప‌డిపోతోంది. అది కూడా ఆ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న జిల్లాలో కాదు... సాక్షాత్తు పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా నుంచే ఈ దెబ్బ త‌గ‌ల‌నుండటం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సి ఉంది. చిత్తూరు పార్ల‌మెంటు స‌భ్యుడు ఎన్‌. శివ‌ప్ర‌సాద్ పార్టీ మారేందుకు దాదాపుగా రంగం సిద్ధ‌మైపోయింది. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌బాబు వైఖ‌రిని నిశితంగా ప‌రిశీలిస్తూ వ‌స్తున్న శివ‌ప్ర‌సాద్‌ కు.. ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు అవ‌గ‌త‌మ‌య్యాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ టికెట్ త‌న‌కు ఇచ్చేందుకు కూడా చంద్ర‌బాబు సిద్ధంగా లేర‌న్న అనుమానం కూడా శివ‌ప్ర‌సాద్‌ కు అవ‌గ‌త‌మైన‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల శివ‌ప్ర‌సాద్ కుమార్తెపై సొంత పార్టీ నేత‌ - నాడు మంత్రిగా ఉన్న బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అనుచ‌రులు దాడికి దిగితే... చంద్ర‌బాబు ప‌ల్లెత్తు మాట అన‌క‌పోవ‌డాన్ని కూడా శివ‌ప్ర‌సాద్ జీర్ణించుకోలేక‌పోయారు. ఈ విష‌యంలో త‌న కుమార్తె న‌డిరోడ్డుపై గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుంటే కూడా చంద్ర‌బాబు ఈ విష‌యంపై దృష్టి సారించ‌క‌పోవ‌డాన్ని శివ‌ప్ర‌సాద్ తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ మార‌డం మిన‌హా ప్ర‌త్యామ్నాయం లేద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన శివ‌ప్ర‌సాద్‌... వైసీపీలోకి చేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. శివ‌ప్ర‌సాద్ మ‌న‌సులోని మాట తెలిసినా కూడా చంద్ర‌బాబు అండ్ కో ఏమాత్రం ప‌ట్టించుకోని విధంగానే వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే శివ‌ప్ర‌సాద్ నిన్న అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా నిన్న చిత్తూరులోనే చంద్ర‌బాబు అండ్ కోపై నిర‌స‌న గ‌ళం విప్పారు.

రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారిన ఈ విష‌యంపై చంద్ర‌బాబు టీం కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. హెచ్చ‌రిక‌లు జారీ చేస్తే వెన‌క్కు త‌గ్గుతార‌ని భావించిన బాబు బ్యాచ్‌... ముందుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌ని, అయితే ఆ హెచ్చ‌రిక‌ల‌కు శివ‌ప్ర‌సాద్ ఘాటుగా స‌మాధాన‌మివ్వ‌డంతో ఆయ‌న పార్టీ వీడ‌టం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా... పార్టీకి రాజీనామా, ఇత‌ర పార్టీల్లో చేర‌తానంటూ ప్ర‌క‌టించ‌క ముందే ఆయ‌న‌పై టీడీపీ అధిష్ఠానం చ‌ర్య‌ల‌కు కూడా రంగం సిద్ధం చేస్తున్న తీరు కూడా శివ‌ప్ర‌సాద్ పార్టీ మార్పు ఖాయ‌మ‌న్న సంకేతాల‌ను ఇస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... శివ‌ప్ర‌సాద్ అధికార పార్టీ టీడీపీ నుంచి విప‌క్షం వైసీపీలోకి జంప్ చేయ‌డం ఖాయ‌మైపోయింద‌ని, ముహూర్తం ఖ‌రారే మిగిలుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/