Begin typing your search above and press return to search.

వేషాలు మొద‌లెట్టేసిన ఏపీ టీడీపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   24 July 2018 1:36 PM IST
వేషాలు మొద‌లెట్టేసిన ఏపీ టీడీపీ ఎంపీ!
X
తెలుగు ఎంపీలు.. అందునా ఏపీ ఎంపీల్లో మెలోడ్రామా కాస్త ఎక్కువ‌. మామూలుగా అయితే ఇలాంటివి క‌నిపించేవి కాదు కానీ.. అందుబాటులోకి వ‌చ్చిన‌ స్మార్ట్ ఫోన్ల పుణ్య‌మా అని త‌మ్ముళ్ల లీల‌లు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఓ త‌మ్ముడు స్టీల్ ఫ్యాక్ట‌రీ పేరుతో హ‌డావుడి చేస్తూ.. నిరాహార‌దీక్ష చేస్తుంటే.. మిగిలిన త‌మ్ముళ్లు ఢిల్లీలో సావ‌ధానంగా కూర్చొని.. నేనూ ఓ ఐదు కిలోలు త‌గ్గాల‌నుకుంటున్నాను.. నాకేమ‌న్నా ఐడియాలు ఇస్తారా? అంటూ చేసిన వ్యాఖ్య‌లు దిమ్మ తిరిగేలా చేశాయి.

ఈ లీల‌లు వైర‌ల్ కావ‌టంతో ప‌రువు ద‌క్కించుకునేందుకు నానా పాట్లు ప‌డ‌టం త‌ర్వాతి సంగ‌తి. ఇలా.. చిత్ర‌విచిత్ర‌మైన ప‌నులు చేసే త‌మ్ముళ్ల‌లో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ తీరు కాస్త వేరు. క‌ళ‌లంటే ఆయ‌న‌కు మ‌క్కువ ఎక్కువ‌. నాట‌కాలు.. సినిమాలతో త‌న క‌ళాతృష్ణ‌ను తీర్చుకునే ఎంపీగారు.. ఏపీకి సంబంధించి ఏ ఆందోళ‌న చేయాల‌న్నా.. వెంట‌నే త‌న‌కు స‌రిపోయే వేషాన్ని వెతుక్కుంటారు.

కొన్ని వేషాల్ని చూసి న‌వ్వుకున్నా ఆయ‌న అస్స‌లు పట్టించుకోరు. త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌దిలించేలా ఉండాలే కానీ.. వేషాలు వేసినోళ్లు క‌దిలిపోయేలా ఉండ‌కూడ‌దు.ఈ చిన్న పాయింట్ ను శివ‌ప్ర‌సాద్ త‌ర‌చూ మిస్ అవుతార‌న్న పేరుంది. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలోనూ.. త‌ర్వాత హోదా సాధ‌న స‌మ‌యంలోనూ చిత్ర‌.. విచిత్ర‌మైన వేషాలు వేస్తూ మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించే శివ‌ప్ర‌సాద్..కొంత‌కాలంగా కామ్‌గా ఉన్నారు.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌టం.. అది కాస్తా వీగిపోయిన నేప‌థ్యంలో టీడీపీ ఎంపీలు ఇప్పుడు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు. నిన్న‌టికి నిన్న రాజ్య‌స‌భ‌లో హ‌డావుడి ప్ర‌ద‌ర్శించిన త‌మ్ముళ్లు.. ఈ రోజు నిర‌స‌న తెలుపుతున్నారు. ఇలాంటి వేళ‌లో త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించే శివ‌ప్ర‌సాద్‌.. ఈ రోజు మా తెలుగు త‌ల్లికి మ‌ల్లెపూదండ గేయ ర‌చ‌యిత శంక‌రంబాడి సుంద‌రాచారి వేషంలో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో క‌నిపించారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టిన శివ‌ప్ర‌సాద్ త‌న వేష‌ధార‌ణ‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేశారు. తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేయొద్దంటూ గీతాన్ని ఆల‌పించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. శివ‌ప్ర‌సాద్ హ‌డావుడిని చూసిన మిగిలిన ఎంపీలు.. త‌మ్ముడు మొద‌లెట్టేశాడుగా అనుకోవ‌టం క‌నిపించింది.