Begin typing your search above and press return to search.

మోడీ వేషంలో జీవించిన ‘తమ్ముడు ఎంపీ’

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:32 AM GMT


వేషాలు వేయటంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తర్వాతే ఎవరైనా. ‘‘వేషాలు వేయటం’’ మాటను శివప్రసాద్ విషయంలో నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూడాల్సిందే. రాష్ట్ర విభజన సమయంలో తన వేషాలతో దేశ వ్యాప్తంగా విశేష ప్రచారం తెచ్చుకున్న ఆయన.. సమయానికి తగ్గట్లు వేషాలు వేస్తూ.. తనలోని కళాకారుడ్ని సంతృప్తి పరుస్తుంటారు.

ఇప్పటివరకూ ఎన్నో వేషాలు వేసిన ఆయన.. తాజాగా వేసిన వేషం మాత్రం పార్టీ నేతల దగ్గర నుంచి ప్రజల వరకూ కాస్తంత విస్మయానికి గురిచేసింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏపీ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మన మట్టి.. మన నీరు.. మన అమరావతి మహా సంకల్ప యాత్రను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. కానీ.. పొట్టిగా ఉన్న మోడీ అందరిని ఆకర్షించారు.

వేలాదిగా హాజరైన ఈ కార్యక్రమానికి మోడీ వేషంలో వచ్చిన వ్యక్తిని చూసి విస్మయం చెందారు. ఇలాంటి వేషాల్లో వచ్చిన వారు ప్రముఖంగా కాకుండా.. ఎక్కడో ఒక మూల ఉంటారు. కానీ.. వేషం వేసుకొచ్చిన వ్యక్తికి గన్ మెన్లురక్షణగా నిలవటం.. హడావుడి కనిపించింది. ప్రధాని మోడీ వేషం వేసుకొచ్చింది చూస్తే.. అదెవరో కాదు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఆయన వేసుకొచ్చిన వేషం చూసి తెలుగుదేశం పార్టీ నేతలే కాదు.. కార్యకర్తలు.. ప్రజానీకం ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.

వేషం వేయటం ఒక ఎత్తు అయితే.. వేసిన వేషంలో ఎంపీ శివప్రసాద్ జీవించేశారు. అచ్చు మోడీ మాదిరిగా వేషం వేయటమే కాదు.. ఆయనలా బహిరంగ సభలో కాసేపు హిందీలో మాట్లాడి అలరించారు. ఈ తమ్ముడు ఎంపీకి ఈ వేషాల ఇంట్రస్ట్ ఏమిటో..?