Begin typing your search above and press return to search.

జేసీతో జ‌గ‌డం లేదంటోన్న సుజ‌నా!

By:  Tupaki Desk   |   19 July 2018 9:43 AM GMT
జేసీతో జ‌గ‌డం లేదంటోన్న సుజ‌నా!
X

శుక్ర‌వారం జ‌ర‌గ‌బోతోన్న అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని, త‌న జిల్లాపై చంద్ర‌బాబు చిన్న‌చూపు చూస్తున్నార‌ని జేసీ అల‌క‌బూడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దాంతో పాటు, అవిశ్వాసంపై వివిధ పార్టీల మద్దతు కోర‌నున్న‌ టీడీపీ ఎంపీల‌ బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న ఎంపీ సుజ‌నా చౌద‌రి వైఖ‌రిపై జేసీ అసంతృప్తితో ఉన్నార‌ని వ‌దంతులు వినిపిస్తున్నాయి. సుజ‌నా తీసుకునే ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు జేసీకి న‌చ్చ‌డం లేద‌ని....అందుకే అవిశ్వాస తీర్మానానికి డుమ్మా కొట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ప్ర‌స్తుతం జేసీని ఎలాగోలా బుజ్జగించేందుకు చంద్ర‌బాబు ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో, జేసీ వ్యవహారంపై సుజనా చౌదరి స్పందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవని స్ప‌ష్టం చేశారు.

శుక్ర‌వారం జ‌ర‌గ‌బోతోన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు ముందు టీడీపీకి జేసీ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. లోక్‌ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమ‌ని జేసీ మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుజ‌నాతో జేసీకి విభేదాలున్నాయ‌ని వ‌దంతులు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆ వ్యాఖ్య‌ల‌పై సుజ‌నా చౌద‌రి స్పందించారు. త‌మ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని, ఎంపీలంతా స‌ఖ్యంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. తమ పార్టీలో జేసీ సీనియర్ నేత అని - పార్టీపై జేసీ కొద్దిగా అసంతృప్తితో ఉన్న సంగ‌తి మీడియా ద్వారా తెలిసింద‌ని అన్నారు. జేసీతో తాను ఈ రోజు కూడా మాట్లాడానని - తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే అనంత‌పురం వెళ్లిన‌ట్లు చెప్పార‌ని అన్నారు. పార్టీపై జేసీకి అసంతృప్తి ఉంటే..తాము చ‌ర్చించుకొని సరి చేసుకుంటామన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ హాజరు అవుతారని తాను భావిస్తున్నాన‌ని - జేసీతో చంద్ర‌బాబు మాట్లాడుతున్నారని సుజనా...ఢిల్లీలో మీడియాతో చెప్పారు.