Begin typing your search above and press return to search.

మోడీ సెంటిమెంట్ తో తెలుగు తమ్ముళ్ల వ్యూహం రెఢీ

By:  Tupaki Desk   |   17 Nov 2019 5:20 AM GMT
మోడీ సెంటిమెంట్ తో తెలుగు తమ్ముళ్ల వ్యూహం రెఢీ
X
మరో రోజులో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించి.. ప్లాన్ ఒకటి సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

ఏపీ అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా తాజా ప్లాన్ ఉందంటున్నారు. ఏపీ రాజధానిగా తమ హయాంలో షురూ చేసిన అమరావతి విషయంలో టీడీపీ ఎంపీలు ఏం చేయాలన్న దానిపైనా వ్యూహం రెఢీ అయ్యిందంటున్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ చేతులు మీదుగా స్టార్ట్ అయిన రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించటం.. మోడీ సెంటిమెంట్ తో ఇరుకున పడేయాలన్నది తాజా ఆలోచనగా చెబుతున్నారు.

కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారతదేశ మ్యాప్ లోనూ ఏపీ రాజధాని పేరు లేకుండా ప్రచురించిన వైనాన్ని పార్లమెంటులో లేవదీయాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. అమరావతి అంశాన్ని ప్రస్తావించే సమయంలో ప్రధాని మోడీ ప్రస్తావన పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలుగు తమ్ముళ్ల ఆలోచనగా చెబుతున్నారు. మోడీ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకొని ఏపీ అధికారపక్షం ఇరుకున పెట్టేలా చేయటమే టీడీపీ ఎంపీల లక్ష్యమంటున్నారు. మరి.. దీనికి ఏపీ అధికారపక్షం కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.