Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని నివాసం ముట్ట‌డికి ప్ర‌య‌త్నించిన త‌మ్ముళ్లు

By:  Tupaki Desk   |   8 April 2018 10:47 AM GMT
ప్ర‌ధాని నివాసం ముట్ట‌డికి ప్ర‌య‌త్నించిన త‌మ్ముళ్లు
X
చేయాల్సిన‌వి చేయ‌లేన‌ప్పుడు.. ఏదో ఒక‌టి చేస్తున్న‌ట్లుగా హ‌డావుడి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేత‌ల ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ విప‌క్షం చేస్తున్న నిర‌స‌న‌ల హ‌డావుడి నేప‌థ్యంలో.. తాము ఏమీ చేయ‌టం లేద‌న్న భావ‌న క‌లిగ‌స్తున్న వైనాన్ని త‌గ్గించేందుకు ప‌డుతున్న పాట్లు అన్నిఇన్నికావు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మాదిరి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేసేందుకు అధినేత నుంచి ఆదేశాలు రాని వైనం ఒక‌ప‌క్క‌.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న దీక్ష దెబ్బ‌కు.. మీరేం చేయ‌లేక‌పోతున్నారంటూ వ‌స్తున్న ఒత్తిడిని అధిగ‌మించేందుకు వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. ఇందులో భాగంగా ఈ రోజున కొత్త త‌ర‌హా ఆందోళ‌న‌కు తెర తీశారు.

ఆదివారం ఉద‌యం ఎంపీ సుజ‌నా చౌద‌రి ఇంట్లో భేటీ అయిన టీడీపీ ఎంపీలు ఫ్యూచ‌ర్ ప్లాన్ మీద చ‌ర్చ‌లు జ‌రిపి అనంత‌రం.. ప్ర‌ధాని మోడీ నివాసాన్ని ముట్ట‌డించాల‌ని నిర్ణ‌యించారు.

ప్ల‌కార్డులు పట్టుకొని.. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేసుకుంటూ ప్ర‌ధాని నివాసాన్ని చేరుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా మాకున్యాయం చేయాలంటూ వారు నినాదాలు చేశారు. ఆందోళ‌న చేస్తున్న ఎంపీల్ని అడ్డుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది వారిని ప్ర‌ధాని నివాసం వ‌ర‌కూ రాకుండా అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎంపీల‌కు.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య స్వ‌ల్ప వాదులాట చోటు చేసుకుంది. త‌మ‌ను ప్ర‌ధాని నివాసం వ‌ర‌కూ నిర‌స‌న చేసేందుకు అనుమ‌తించాల‌ని వారు డిమాండ్ చేశారు.

అందుకు స‌సేమిరా అన్న భ‌ద్ర‌తా బ‌ల‌గాల తీరును తెలుగు ఎంపీలు త‌ప్పు ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు రోడ్డు మీద బైఠాయించారు. దీంతో.. ఎంపీల్ని బ‌లవంతంగా కాళ్లు.. చేతులు ప‌ట్టుకొని బ‌స్సులోకి ఎక్కించి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేస్తే అడ్డుకోవ‌టం స‌రికాద‌ని టీడీపీ ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌మ‌ను అడ్డుకోవ‌టం ద్వారా మోడీ నిరంకుశ‌త్వం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ రోజుల త‌ర‌బ‌డి నోళ్లు చించుకుంటున్నా కేంద్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన వారు.. ఏపీకి ప్ర‌ధాని మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ర‌న్నారు. ఇదిలా ఉంటే.. త‌మ‌ను అడ్డుకోవ‌టంపై సుజ‌నా స్పందిస్తూ.. దీన్నో బ్లాక్ సండేగా అభివ‌ర్ణించారు. నిర‌స‌న చేసే ప్ర‌య‌త్నం చేసినటీడీపీ ఎంపీల‌ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుగ్ల‌క్ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఇదిలా ఉంటే.. పోలీసు బ‌స్సులో నుంచి కింద‌కు దిగేదే లేదంటూ భీష్మించుకొని కూర్చోవ‌టంతో పోలీసులు వారిని సముదాయించి.. కింద‌కు దింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.