Begin typing your search above and press return to search.

మైలేజీ కోసం త‌మ్ముళ్ల పాట్లు అన్నిఇన్ని కావు

By:  Tupaki Desk   |   8 April 2018 11:30 AM GMT
మైలేజీ కోసం త‌మ్ముళ్ల పాట్లు అన్నిఇన్ని కావు
X
మైలేజీ రేస్ మొద‌లైంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు ఏపీ విప‌క్ష ఎంపీలు త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేయ‌టం.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌టం తెలిసిందే. జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌కు మించి ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న టీడీపీ ఎంపీల్లో ఎక్కువైంది. హోదా సాధ‌న అంశంలో తాము వెనుక‌బ‌డిపోతున్న‌ట్లుగా టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి శ‌నివారం ఢిల్లీ నుంచి త‌మ ప్రాంతాల‌కు టీడీపీ ఎంపీలు ప్ర‌యాణం కాగా.. చంద్ర‌బాబు వారిని నిలువ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండాల‌ని.. జ‌గ‌న్ పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు పోటీగా ఏదో ఒక యాక్టివిటిలో మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించాలన్న మాట‌తో.. ఏపీకి వెళ్లేందుకు సిద్ధ‌మైన నేత‌లు కూడా ఆగిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. ప్ర‌ధాని నివాసాన్ని ముట్ట‌డించే కార్య‌క్ర‌మానికి తెర తీసిన టీడీపీ ఎంపీలు ఈ సంద‌ర్భంగా త‌మ నిర‌స‌ను అడ్డుకునే పోలీసుల వ‌ద్ద చేసిన వాదులాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎవ‌రైనా స‌రే.. నిర‌స‌న చేసేందుకు ప్ర‌ధాని నివాసం వ‌ద్ద‌కు చేరుకుంటున్నారంటే.. వారి స్థాయిల్ని చూసేదేమీ ఉండ‌దు. ఎవ‌రిదాకానో ఎందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంటి ముందు విప‌క్ష నేత‌లు శాంతియుతంగా నిర‌స‌న చేస్తారంటే అనుమ‌తిస్తారా?

ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే అయినా.. ర‌చ్చ చేయ‌టానికి.. ఏపీ హోదా కోసం తామెంతో చేశామ‌ని చెప్పుకోవ‌టానికి తెలుగు త‌మ్ముళ్ల ఆరాటంగా తాజా నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చెప్పాలి. ప్ర‌ధాని నివాసం వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన టీడీపీ ఎంపీల్ని భ‌ద్ర‌తాధికారులు అడ్డుకున్న స‌మ‌యంలో.. టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడిన వైనం.. ఈ సంద‌ర్భంగా మోడీపై వారు చేసిన విమ‌ర్శ‌లు చూస్తే.. తెలుగు త‌మ్ముళ్ల ల‌క్ష్యం ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

టీడీపీ ఎంపీలు కోరుకున్న‌ట్లే. వారు మీడియాలో క‌వ‌ర్ అయ్యారు. ఇక‌.. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఛాన‌ల్ మైకుల్లో మోడీపై ఎడాపెడా విమ‌ర్శ‌లు చేసేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆమ‌ర‌ణ దీక్ష‌కు పైచేయిగా చేయాల‌న్న త‌మ్ముళ్ల ల‌క్ష్యం వ‌ర్క్ వుట్ కాకున్నా.. త‌మ‌కు చేత‌నైనంత రీతిలో ఏదో ఒక హ‌డావుడి చేయాల‌న్న‌ట్లుగా వారి తీరు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. మోడీపై విమ‌ర్శ‌లు చేసిన వారిలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు కాస్త తీవ్రంగా ఉన్నాయి. వ్య‌క్తిగ‌తంగా మోడీని ఉద్దేశించి ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉన్నాయి. ప్ర‌తి రాష్ట్రాన్ని గోద్రాలో చేయాల‌న్న‌ట్లుగా మోడీ తీరు ఉందంటూ ఫైర్ అయిన జేసీ.. పెళ్లాం.. పిల్ల‌లు ఉన్న వాళ్ల‌కు ఏపీ ఎంపీల ఆందోళ‌న‌లు అర్థ‌మ‌వుతాయ‌న్నారు. ప్రేమ‌.. కుటుంబం లేని వ్య‌క్తి మోడీ అని.. ఆయ‌న‌ది లెక్క‌లేనిత‌నంగా అభివ‌ర్ణించారు. క‌నీసం భార్యాపిల్ల‌లు లేకున్నా పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకున్నా కుటుంబ విలువ తెలిసేదంటూ నిప్పులు చెరిగిన జేసీ.. మోడీ క‌ర్కోట‌క హృద‌యుడ‌ని మండిప‌డ్డారు.

విభ‌జ‌న చాలా అనైతికంగా జ‌రిగింద‌ని.. మోడీ హామీలు చాలానే ఇచ్చార‌ని.. వాటినే అమ‌లు చేయాల‌ని తాము అడుగుతున్నా అమ‌లు చేయ‌టం లేద‌ని మ‌రో ఎంపీ ముర‌ళీమోహ‌న్ వ్యాఖ్యానించారు. త‌మ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ త‌మ‌ను అరెస్ట్ చేస్తున్నార‌ని.. త‌మ గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ త‌ప్పు ప‌ట్టారు.

పార్ల‌మెంటులో గ‌డిచిన కొద్దిరోజులుగా గొంతు చించుకున్నా త‌మ‌ను మోడీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు. తాము ఎంపీల‌మ‌ని.. ఆ విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. త‌మ‌ను అడ్డుకున్న విష‌యంపై ప్ర‌ధానే స‌మాధానం చెప్పాల‌న్నారు. మ‌రో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాట్లాడుతూ.. తమ‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ప్ర‌ధాని నివాసం వ‌ద్ద‌కు వ‌చ్చి శాంతియుతంగా ఆందోళ‌న జ‌రుపుతున్నా.. అందుకు సైతం ఒప్పుకోక‌పోవ‌టం దారుణ‌మ‌న్నారు. ప్ర‌శాంతంగా నిర‌స‌న తెలిపితే దానికి కూడా అనుమ‌తించ‌మంటే ఎలా అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. తామున్న‌ది భార‌త్ మాదిరి లేద‌ని.. చైనా.. ర‌ష్యాల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

త‌మ‌ను ఎంపీల‌మ‌ని కూడా చూడ‌కుండా ఈడ్చుకెళ్లార‌ని.. చంపుతారా? అంటూ మండిపడ్డారు సీఎం ర‌మేశ్‌. పార్ల‌మెంటులో పెట్టిన బిల్లును అమ‌లు చేయ‌మ‌ని అడిగితే వెన‌కాడ‌టం ఏమిటంటూ బుట్టా రేణుక ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని నివాసం ఎదుట భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని దాటుకొని టీడీపీ ఎంపీలు లోప‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా అడ్డుకున్న పోలీసులు.. వారిని వాహ‌నాల్లోకి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా కాసింత తోపులాట చోటు చేసుకుంది.