Begin typing your search above and press return to search.

పిలిచి మాట అనిపించుకున్న సోనియా

By:  Tupaki Desk   |   7 Feb 2018 5:25 AM GMT
పిలిచి మాట అనిపించుకున్న సోనియా
X
ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌కు వేదికైంది మంగ‌ళ‌వారం నాటి పార్ల‌మెంట్ స‌మావేశం. బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై తెలుగు ఎంపీలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టంతో మూడుసార్లు స‌భ వాయిదా ప‌డింది. విభ‌జ‌న హామీల్ని ఎంత‌కూ నెర‌వేర్చ‌రంటూ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ స‌మ‌యంలో స‌భ‌లో ప్ర‌ధాని మోడీ.. ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ.. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల‌తో పాటు ముఖ్య‌నేత‌లంతా ఉన్నారు.

టీడీపీ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని ఆందోళ‌న చేస్తున్న వైనంపై బీజేపీ.. కాంగ్రెస్ ఎంపీలు వేర్వేరు సంద‌ర్భాల్లో వాదులాట‌కు దిగగా.. ప్ర‌ధాని మోడీ.. సోనియాగాంధీ వారించ‌టం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న చేసి.. స‌భ వాయిదా ప‌డ‌టంతో వెళ్లిపోతున్న టీడీపీ ఎంపీ కేశినేని నానిని సోనియాగాంధీ త‌న వ‌ద్ద‌కు పిలిచారు. దీంతో ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

ఎందుకు వాద‌న‌కు దిగుతున్నారంటూ నానిని సోనియా త‌న‌ను అడిగిన‌ట్లుగా నాని చెప్పారు. మీ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట‌పోయి.. ఈ రోజు ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మైంద‌ని తాను ఆమెతో చెప్పిన‌ట్లు చెప్పారు. విభ‌జ‌న కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ లాభ‌ప‌డింది లేద‌ని.. రెండు రాష్ట్రాల్లోనూ న‌ష్ట‌పోయింద‌ని.. కేంద్రంలో మీరు అధికారంలోకి రాలేక‌పోయాన‌ని తాను ఆమెతో చెప్పిన‌ట్లుగా చెప్పారు. నాని మాట‌ల‌కు సోనియా మౌనంగా విన్న‌ట్లుగా తెలిసింది.

ఇదిలా ఉంటే.. తెలుగు ఎంపీలు లోక్ స‌భ‌లో ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో టీడీపీ ఎంపీ మాగంటి బాబు ప్ల‌కార్డు తిప్పి ప‌ట్టుకోవ‌టాన్ని సోనియాగాంధీ గుర్తించారు. ఆ వెంట‌నే.. మ‌రో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు సంజ్ఞల ద్వారా ప్ల‌కార్డు తిప్పి ప‌ట్టుకున్నార‌న్న విష‌యాన్ని చెప్పారు. దీంతో స్పందించిన గల్లా.. మాగంటికి ప్ల‌కార్డును తిప్పి ప‌ట్టుకున్న విష‌యాన్ని చెప్ప‌టంతో ఆయ‌న స‌రి చేసుకున్నారు.

ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తున్నారంటూ ఆందోళ‌న చేస్తున్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుపై స్పీక‌ర్ తీవ్ర ఆస‌హ‌నానికి గుర‌య్యారు. స్పీక‌ర్ స్థానానికి ఎదురుగా నిల్చుని ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించ‌టంతో.. అది త‌న‌కు అడ్డుగా ఉండ‌టంతో ఆమె అస‌హ‌నానికి గుర‌య్యారు. దీంతో.. ప్ల‌కార్డు ప‌ట్టుకున్న మాగంటి పేరు ఏమిట‌ని త‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి ద్వారా తెలుసుకున్న స్పీక‌ర్.. మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావుగా తెలుసుకొని.. మిస్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ల‌కార్డు ప‌ట్టుకోవ‌టంలో నేనూ సాయం చేయాలా? అంటూ అస‌హ‌నంతో ప్ర‌శ్నించారు.