Begin typing your search above and press return to search.

హోదా కోసం తమ్ముళ్ల వాయిదా తీర్మానం

By:  Tupaki Desk   |   2 Aug 2016 7:03 AM GMT
హోదా కోసం తమ్ముళ్ల వాయిదా తీర్మానం
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేస్తామని.. ఈ విషయంలో రాజీ పడేది లేదన్నట్లుగా చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు తగ్గట్లే గడిచిన రెండు రోజులుగా తెలుగు తమ్ముళ్లు మాటల్లోనూ.. చేతల్లోనూ మార్పు రావటం తెలిసిందే. ఏపీ విపక్షాలు హోదా మీద బంద్ నిర్వహిస్తున్న వేళ.. టీడీపీ నేతలు తమదైన శైలిలో వ్యవహరించారు. సోమవారం.. ప్రత్యేక హోదా మీద లోక్ సభ దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ.. ఆందోళనలు నిర్వహించిన టీడీపీ.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

హోదా మీదా రాజీ పడేది లేదని.. ఈ అంశంపై కేంద్రం దిగొచ్చే వరకూ తమ ప్రయత్నాలు ఆపమన్నట్లుగా తాజాగా వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. హోదాపై పోరుబాట సాగిస్తున్న విపక్షాలకు ధీటుగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ సభలో ప్రత్యేక హోదా అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. నేటి చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను తెలుగుదేశం ఎంపీలు కోరారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఇంతకాలం ఆచితూచి వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఎంపీలు సోమవారం నుంచి నిరసనల్ని పెద్ద ఎత్తున చేపట్టటం తెలిసిందే. ఏపీలో విపక్షాలు హోదా మీద విరుచుకుపడుతున్న వేళ.. తాము సైతం ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తున్నామని.. హోదా కోసం తమదైన ప్రయత్నాలు చేస్తున్నామన్న భావన ప్రజల్లో కలిగేలా వ్యవహరిస్తున్నట్లు చెప్పొచ్చు. సోమవారం మాదిరే ఈ రోజు కూడా ప్రత్యేక హోదా అంశంపై లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శించి.. రచ్చ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.