Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్లు మైకుల్ని బాగా వాడేశారుగా!

By:  Tupaki Desk   |   12 July 2018 4:46 AM GMT
త‌మ్ముళ్లు మైకుల్ని బాగా వాడేశారుగా!
X
త‌ప్పు చేసిన‌ప్పుడు నోరు విప్పాలంటే సిగ్గుతో చ‌చ్చిపోయే ప‌రిస్థితి. ఇలాంటివ‌న్నీ సామాన్యుల‌కు.చ‌ర్మం బాగా మందంగా మారి.. రాజ‌కీయ‌మే జీవితంగా.. స్వార్థ‌మే ప‌ర‌మార్థంగా.. ప్ర‌జ‌ల బాగు కంటే త‌మ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేసే నేత‌ల మాట‌లు ఎలా ఉంటాయ‌న‌టానికి తెలుగు త‌మ్ముళ్ల మాట‌లే తాజా ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి.

ప్ర‌త్యేక హోదా డిమాండ్ పై తెలుగుదేశం పార్టీ అధినేత ద‌గ్గ‌ర నుంచి.. ఆ పార్టీ ఎంపీల వ‌ర‌కూ ఎప్పుడు.. ఎవ‌రు.. ఎలా వ్య‌వ‌హ‌రించారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

మోడీకి కోపం క‌ల‌గ‌కుండా ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. త‌ప్పు మీద త‌ప్పు చేస్తూ.. ప్ర‌త్యేక హోదా సాధ‌నను పీట‌ముడులు వేసిన అధినేత చంద్ర‌బాబు తీరును ప్ర‌శ్నించ‌టంలోనూ త‌మ్ముళ్లు ఫెయిల్ అయ్యార‌ని చెప్పాలి. బ‌హిరంగంగా కాకున్నా.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అయినా ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో తాము అనుస‌రిస్తున్న వైనం త‌ర్వాతి రోజుల్లో త‌మ‌కు గుదిబండ‌గా మార‌ట‌మే కాదు.. శాశ్వతంగా త‌మ‌పై వేలు వెత్తి చూపించే ప‌రిస్థితి తెచ్చుకుంటున్నామ‌న్న మాట‌ను బాబుకు స్ప‌ష్టం చేయాల్సి ఉంది.

కానీ.. అలాంటిదేమీ లేకుండా బాబు మాట‌ల‌కు బొమ్మ‌ల మాదిరి త‌లూపి.. నాలుగేళ్ల పుణ్య‌కాలం గ‌డిచిపోయాక‌.. ప్ర‌త్యేక హోదా మీద ఏదేదో చేస్తామంటూ తెలుగుత‌మ్ముళ్లు చెబుతున్న మాట‌లు వింటున్న ఆంధ్రోళ్ల‌కు ఎక్క‌డెక్క‌డో కాలిపోతుంద‌ట‌. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఆంధ్రోళ్లు ఉద్య‌మబాట‌లో వెళుతున్న వేళ‌.. వారిని అధికారంతోనూ.. కేసుల బూచితోనూ అణ‌గ‌దొక్కిన టీడీపీ స‌ర్కార్ ఇప్పుడేమో.. ప్ర‌త్యేక హోదాను నిర‌స‌న పోరాటాల ద్వారా సాధిస్తామ‌న్న పెద్ద మాట‌ల్ని చెబుతున్నారు.

తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన క‌రువు నేల‌పై కేంద్ర వివ‌క్ష నినాదంతో టీడీపీ ఎంపీలు బుధ‌వారం నిర‌స‌న దీక్ష‌ను చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడిన మాటల్ని వింటే..స‌భ‌కు తీసుకొచ్చిన మైకుల‌కు నూటికి నూరు శాతం వాడేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. నాలుగేళ్లుగా తమ‌కు ప‌ట్ట‌ని అంశంపై వారెంత‌గా చెల‌రేగిపోయారో చూస్తే.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుబాట ప‌ట్టించ‌టంలో త‌మ‌కు తామే సాటి అన్న‌ట్లుగా వారి మాట‌లు సాగాయి.

ప్ర‌త్యేక హోదా సాధ‌నలో తాము చేసిన త‌ప్పుల్ని గుర్తుంచుకోకుండా.. ఎలాంటి మొహ‌మాటానికి తావివ్వ‌కుండా.. అస్స‌లు సిగ్గు ప‌డ‌కుండా త‌మ్ముళ్లు చెప్పిన మాట‌లు వింటే.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు మాట‌ల్ని తిప్పేయ‌టంలో త‌మ్ముళ్ల‌కు త‌మ్ముళ్లే సాటి అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

ఢిల్లీ పెద్ద‌లు రాష్ట్రంపై ప‌గ‌బ‌ట్టిన‌ట్లుగా ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు అరుపులు పెడితే.. ప్ర‌త్యేక‌హోదా రాష్ట్రానికి ఇస్తే ప్ర‌ధాని ప‌ద‌వికి చంద్ర‌బాబు ఎక్క‌డ అడ్డొస్తారో అన్న భ‌యం మోడీకి ఉంద‌ని.. అందుకే ఆయ‌న హోదా ఇవ్వ‌టం లేదంటూ స‌రికొత్త‌గా మాట్లాడారు సీఎం ర‌మేశ్‌. విభ‌జ‌న హామీలు భిక్ష కాద‌ని.. హ‌క్కుగా అడుగుతున్న‌ట్లుగా మ‌రో ఎంపీ అవంతిశ్రీ‌నివాస్ చెప్పుకొచ్చారు. మోడీ మాట త‌ప్పిన‌ట్లుగా ఎంపీ కేశినేని మండిప‌డ్డారు. రాష్ట్రానికి చేసిన అన్యాయానికి బీజేపీకి రాష్ట్ర ప్ర‌జ‌లు శిక్ష విధించాల‌ని కొన‌కొళ్లు పిలుపునిచ్చారు. మొత్తానికి త‌మ త‌ప్పుల్ని క‌వ‌ర్ చేస్తూ..బీజేపీతో నాలుగేళ్ల త‌మ రాజీని మ‌ర్చిపోయి విరుచుకుప‌డ‌టం చూసిన‌ప్పుడు అద్దెకు తెచ్చిన ఎంత బాగా త‌మ్ముళ్లు వాడేశారో ఇట్టే అర్థం కావ‌ట్లేదు?