Begin typing your search above and press return to search.

ఎంపీలకు ఉన్న ధైర్యం-తెగువ బాబుకు ఉందా?

By:  Tupaki Desk   |   2 Feb 2018 11:30 PM GMT
ఎంపీలకు ఉన్న ధైర్యం-తెగువ బాబుకు ఉందా?
X
బడ్జెట్ ప్రకంపనలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. బడ్జెట్ మీద చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులకు బ్రేకులు వేయాలని - ఎవరికి వారు తమకు తోచినట్లుగా కేంద్రాన్ని విమర్శించకుండా.. దానివల్ల భాజపాతో తన పార్టీ సత్సంబంధాలు దెబ్బతినిపోకుండా చూడాలని నానా కష్టాలు పడుతున్నారు. కానీ.. అందరి నోర్లకూ తాళాలు వేయడం అనేది ఆయనకు సాధ్యం కావడం లేదు. ఏదో చంద్రబాబు సమక్షంలో అమరావతిలో ఉన్నవారు కాస్తా ఆయన అదుపులో మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది గానీ.. ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అయితే ఈ బడ్జెట్ పట్ల నిరసన తెలియజేయడానికి తమ పదవుల్ని వదులుకోవడానికైనా తెగిస్తున్న సొంత ఎంపీలకున్న తెగువ చంద్రబాబునాయుడుకు ఉన్నదా? అనేది ఇప్పుడు ప్రజలకు సందేహం కలుగుతోంది.

బడ్జెట్ కేటాయింపులు వచ్చిన వెంటనే.. తెదేపాకు చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఓ ఎంపీల సమావేశం పెట్టి.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందనే మొక్కుబడి ప్రకటనతో మమ అనిపించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందునుంచీ.. కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు పెద్దగా ఉండకపోవచ్చునని సంకేతాలు అందేలా సన్నాయి నొక్కులు నొక్కుతూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన సుజనా సమక్షంలో ఎవ్వరూ పెద్దగా స్పదించలేదు.

అయితే శుక్రవారం నాటికి ఎంపీలలో మంట మొత్తం బయటకు వస్తోంది. ఎంపీ టీజీ వెంకటేష్ మూడంచెల పోరాటం చేస్తాం అని.. తొలి దశలో కేంద్రమంత్రుల రాజీనామాలు - రెండో దశలో ఎంపీల రాజీనామాలు తర్వాత.. భాజపా బంధానికి రాంరాం అని సెలవిచ్చారు. ఒకవైపు అమరావతిలో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నాయకులు అభిప్రాయాలు తీసుకుంటూ. ఎవ్వరూ రెచ్చిపోయి మాట్లాడవద్దని చెబుతూ ఉండగానే.. మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు భాజపాపై ఒక రేంజిలో విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తే కాంగ్రెస్ లాగే భాజపా కూడా సర్వనాశనం అయిపోతుందని శాపనార్థాలు పెట్టారు. కేంద్రం వైఖరికి నిరసనగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆదివారం పార్టీ ఎంపీలతో చంద్రబాబు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత తుది నిర్ణయం చెప్తా అని రాయపాటి ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంపీలంటే గౌరవం ఉండేదని, భాజపా పాలన వచ్చాక ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని ఆయన అనడం ఈ సందర్భంగా గమనార్హం.

ఆయన మాటలను బేరీజు వేసుకుంటే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ.. కేంద్రంనుంచి, ప్రధాని నుంచి చంద్రబాబునాయుడుకు దక్కుతున్న గౌరవం కూడా సముచితమైనదేం కాదు. కానీ.. ఆయన తనకు మరో గతి లేదన్నట్లుగా ప్రతిదానికీ సర్దుకుపోతూ.. రాష్ట్రప్రయోజనాల్ని తాకట్టు పెట్టేస్తున్నారు. అదే సమయంలో.. కనీసం ఈ బడ్జెట్ ద్రోహం తర్వాత అయినా.. తన సొంత పార్టీ ఎంపీల్లో కనిపిస్తున్న కోపం, తెగింపు అధినేతలోకి వస్తాయా? అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మౌనం వల్ల నష్టమే తప్ప మరేం ఒరగదని అంటున్నారు.