Begin typing your search above and press return to search.

అసలే ముక్కిడి..ఆపై పడిశం:అడిగే దిక్కెవరు!

By:  Tupaki Desk   |   19 Dec 2017 1:30 AM GMT
అసలే ముక్కిడి..ఆపై పడిశం:అడిగే దిక్కెవరు!
X
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను వినిపించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను రాబట్టుకోవడం గురించి.. ఏపీ ఎంపీలు ఎవరైనా ప్రయత్నించాలి. సభలో అడగాలి. అయితే ఆ పనికి పూనుకనేది ఎవ్వరు? తెలుగుదేశం ఎంపీలు - మంత్రి పదవులు వెలగబెడుతున్న వారి విషయంలో ప్రజలకు అలాంటి ఆశలు సన్నగిల్లి పోతున్నాయి. అసలే తెలుగుదేశం ఎంపీలు.. కేంద్రంలో ఎప్పుడో ఓసారి మంత్రులతో భేటీ అయి.. తాము అడగకముందే.. మంత్రులు అన్నీ ఒప్పేసుకున్నట్లుగా పడికట్టు మాటలు వల్లె వేయడం మినహా.. సభాముఖంగా నిర్దిష్టమైన ప్రయత్నాలు తక్కువ. పైగా ఇప్పుడు కేంద్రంలోని భాజపా మరింత బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు తెదేపా ఎంపీలు.. విభజన చట్టం ద్వారా రావాల్సిన హక్కుల గురించి అడిగే స్థితిలో ఉన్నారా? అనేది అనుమానంగా మారుతోంది.

అసలే ముక్కిడి.. ఆపై పడిశం.. అన్న సామెత చందంగా ఏపీ పరిస్థితి తయారవుతోంది. అసలే కేంద్రం వద్ద తెదేపా ఎంపీలు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఈ ఫలితాలు కూడా వారి నోళ్లకు ఇంకాస్త గట్టిగా తాళాలు బిగించేస్తాయేమోనని పలువురు అనుకుంటున్నారు.

ఒకవైపు తెలంగాణ కు చెందిన తెరాస ఎంపీలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విభజన చట్టం ద్వారా తమ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి విషయాన్ని డిమాండ్ చేసి సాధించుకుంటాం అని.. వాటికోసం సభా ముఖంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అని వారు సెలవిస్తున్నారు. అంత గట్టి కార్యచరణ తెదేపా ఎంపీల్లో మచ్చుకైనా కనిపించడం లేదు.

అదే సమయంలో.. తమకు బలం లేదుగానీ.. ఈ విషయంలో ఏదో కాస్త రభస చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. విభజన చట్టం చేసిన హామీలు అన్నీ నెరవేరేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని బతిమాలుకుంటున్నారు. వారు స్పందిస్తారో లేదో అనుమానమే.

ఇలాంటి నేపథ్యంలో. అసలు ఏపీ సమస్యల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించే దిక్కూ మొక్కూ మనకు ఉన్నదా లేదా.. అనేదే ప్రశ్నార్థకం అయిపోతున్నది. చంద్రబాబునాయుడు ప్రతి సారీ పార్లమెంటు సమావేశాలు మొదలు కావడానికి ముందు.. ఎంపీలతో ఓ భేటీ వేసి.. ప్యాకేజీ హామీలు రాబట్టేలా సభలో ప్రస్తావించాలని, విశాఖ జోన్ గురించి మాట్లాడండి అని.. ఒకటే అరిగిపోయిన రికార్డును వేస్తుంటారు. కానీ ఎప్పటిలాగా.. ఈ సారి కూడా విభజన హామీల విషయంలో కేంద్రం మీద ఎలాంటి గట్టి ఒత్తిడి తేకుండానే.. తెదేపా పార్లమెంటు సమావేశాల వ్యవధిని దాటేస్తుందని.. ఏపీ గురించి ఎప్పటికీ పట్టించుకునే దిక్కే కనిపించడం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.