Begin typing your search above and press return to search.

అసలు టీడీపీ ఎంపీలను విశ్వసించొచ్చా?

By:  Tupaki Desk   |   15 July 2018 10:15 AM GMT
అసలు టీడీపీ ఎంపీలను విశ్వసించొచ్చా?
X
ఏపీకి అన్యాయం చేసిన కేంద్రాన్ని ఎండగట్టే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టనుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. అయితే.. గత పార్లమెంటు సెషన్సులో అవిశ్వాసం పెట్టి ఆగమాగమైన టీడీపీ ఎంపీలు ఈసారి మళ్లీ అవిశ్వాసం పెట్టి ఏం సాధిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు.. అసలు టీడీపీ ఎంపీల చిత్తశుద్ధి ఎంత వారిని ఎంతవరకు విశ్వసించాలన్న ప్రశ్నా వినిపిస్తోంది.

టీడీపీ ఎంపీలపై విశ్వాసం లేకపోవడమన్నది మొన్నటి పరిణామాల కారణంగా జరిగింది. కొద్ది రోజుల కిందట సాటి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కడప ఉక్కు కోసం దీక్షకు దిగితే మిగతా ఎంపీలంతా కేంద్ర మంత్రిని కలవడానికంటూ వచ్చి దిల్లీలో ముచ్చట్లు పెట్టి దీక్షను ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంగా మాట్లాడుకోవడం వివాదాస్పదమైంది. దీంతో వీరిని ఎంతవరకు విశ్వసించొచ్చన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

మరోవైపు...తెలుగుదేశం పార్టీ ఎంపీలు వివిధ పార్టీల నేతలను కలిసేలా చంద్రబాబు ప్లాన్ గీశారు. ఈమేరకు కాంగ్రెస్సేతర - బీజేపీయేతర పార్టీల నేతలతో టీడీపీ ఎంపీలు భేటీకానున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసి ప్రత్యేక హోదాకు ఎంపీలు మద్దతు కోరనున్నారు. విభజన చట్టం - హామీలు - అమలు - కేంద్రం వైఖరిపై బుక్‌ లెట్‌ ఇవ్వనున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆందోళనకు వివిధ పార్టీల నేతలను ఎంపీలు మద్దతు కోరనున్నారు. ఇప్పటికే ఎంపీ గరికపాటి మోహనరావు నితీశ్‌ కుమార్‌ అపాయింట్‌ మెంట్‌ కోరారు. అయితే... ఎంపీలను నమ్ముకుని చంద్రబాబు ఏం సాధించగలరో చూడాలి.