Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీల యూట‌ర్న్‌!... బాబుకు బిగ్ షాక్‌!

By:  Tupaki Desk   |   10 April 2018 9:20 AM GMT
టీడీపీ ఎంపీల యూట‌ర్న్‌!... బాబుకు బిగ్ షాక్‌!
X
టీటీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ నిత్యం త‌న‌ను తాను ఆకాశానికెత్తేసుకుంటూ గొప్ప‌లు పోతున్న చంద్ర‌బాబు... ఇప్పుడు ఏపీలో ఉధృతంగా సాగుతున్న ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం నిజంగానే వ‌రుస షాకులిస్తోంద‌ని చెప్పాలి. మొన్న‌టిదాకా కేంద్రంలోని అధికార కూట‌మి ఎన్డీఏలో కీల‌క భాగస్వామిగా ఉన్న‌ప్ప‌టికీ... ప్ర‌ధానిగా ఉన్న‌ క‌ర‌డుగ‌ట్టిన క‌మ‌ల‌నాథుడు న‌రేంద్ర మోదీ నుంచి ఇసుమంత ప్ర‌యోజ‌నాన్ని కూడా రాష్ట్రానికి రాబ‌ట్ట‌లేక‌పోయారు. నాలుగేళ్ల పాటు మోదీతో క‌లిసి న‌డిచిన చంద్ర‌బాబు... ఏడాదిన్న‌ర‌గా త‌న‌కు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌కున్నా ఏమాత్రం సంకోచించ‌లేదు కదా... క‌నీసం ఇసుమంత అనుమానం కూడా రాలేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. అంతేనా మోదీ ఆడ‌మ‌న్న‌ట్లుగా ఆడేసిన చంద్ర‌బాబు... ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ రానుంద‌ని, ప్యాకేజీతో రాష్ట్రానికి హోదా కంటే కూడా మ‌రింత మెరుగైన ల‌బ్ధి చేకూర‌నుందంటూ ఊద‌ర‌గొట్టేశారు. అంతేనా... హోదా మాటెత్తితే జైలుకు పంపిస్తాన‌ని కూడా హుకుం జారీ చేసిన వైనం కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు.

అయితే మొన్న‌టి బ‌డ్జెట్ లో మోదీ స‌ర్కారు కొట్టిన దెబ్బ‌కు మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా తిర‌గ‌బడ్డారు. అదే స‌మ‌యంలో ఆది నుంచి కూడా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతోనే న్యాయం జ‌రుగుతుందంటూ... దాని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ఉద్య‌మం సాగించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... హోదా కోసం పోరును మ‌రింత‌గా తీవ్ర‌త‌రం చేసేశారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా త‌న‌కు ఇష్టం లేన‌ప్ప‌టికీ... ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న ఉద్య‌మంలోకి దూక‌క త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటులో తన పార్టీ ప్ర‌తినిధులుగా ఉన్న ఎంపీల‌కు అమ‌రావ‌తి నుంచే దిశానిర్దేశం చేసేసిన చంద్ర‌బాబు... పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసేదాకా ఆట‌ను ర‌క్తి క‌ట్టించార‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే పార్ల‌మెంటు స‌మావేశాలు ముగియ‌గానే... ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేసిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ల‌కు దిగారు. ఈ దెబ్బ‌కు టీడీపీ చేసిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌న్నీ గాలికి కొట్టేసిన చందంగా తేలిపోయాయ‌న్న వాద‌న వినిపించింది. ఈ నేప‌థ్యంలో ఉద్య‌మాన్ని మ‌రింత‌గా పెంచేయాల‌ని భావించిన చంద్ర‌బాబు... ఎంపీల‌తో బ‌స్సు యాత్ర‌ను ప్లాన్ చేశారు. ఈ యాత్ర‌తో ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్ష‌ల‌తో పాటు రాష్ట్రంలో అంత‌కంత‌కూ ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కూడా దెబ్బ తీయొచ్చ‌న్న‌ది బాబు వ్యూహంగా తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే నిన్న ఎంపీల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు... ఉన్న‌ప‌ళంగా రాష్ట్రానికి వ‌చ్చేయాల‌ని, వ‌చ్చీ రాగానే బ‌స్సు యాత్ర మొద‌లుపెట్టాల్సి ఉంద‌ని తెలిపారు. కాన్ఫ‌రెన్స్ లో స‌రేన‌న్న‌ట్లుగా త‌లాడించిన టీడీపీ ఎంపీలు.... కాన్ఫ‌రెన్స్ ముగియ‌గానే త‌మ‌లో తాము ఓ సారి చ‌ర్చించుకుని బ‌స్సు యాత్ర‌కు వెళ్లేది లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. త‌మ నిర్ణ‌యాన్ని త‌మ నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా చంద్ర‌బాబుకు చేరేలా చేశార‌ట‌. దీంతో షాక్ తిన్న చంద్రబాబు... ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌న్న కోణంలో కొత్త కోణంలో ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయినా నిన్న‌టిదాకా త‌న మాట‌ను జ‌వ‌దాట‌ని ఎంపీలు... ఇప్పుడు తాను చెప్పిన బ‌స్సు యాత్ర‌కు ఎందుకు నిరాక‌రిస్తున్నార‌న్న కోణంలో చంద్ర‌బాబు త‌ల ప‌ట్టుకుని కూర్చున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా తెలుగు త‌మ్ముళ్లు కొట్టిన దెబ్బ బాబుకు బాగా గ‌ట్టిగానే త‌గిలింద‌న్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.