Begin typing your search above and press return to search.

ఉక్కు దీక్షను త‌ల‌పిస్తారా ఏంది త‌మ్ముళ్లు..?

By:  Tupaki Desk   |   2 July 2018 9:57 AM GMT
ఉక్కు దీక్షను త‌ల‌పిస్తారా ఏంది త‌మ్ముళ్లు..?
X
ఉన్న మాట అంటే ఉలుకెక్కువ‌ని ఊరికే అన‌లేదు మ‌రి. తెలుగు త‌మ్ముళ్ల తీరు చూస్తే ఈ సామెత ఇట్టే గుర్తుకు వ‌స్తుంది. క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం పెద్ద ఎత్తున దీక్ష చేస్తూ.. భారీ రాజ‌కీయ మైలేజీ కోసం వేసిన బాబు ప్లాన్ ను తెలుగు త‌మ్ముళ్లు ఎంత అట్ట‌ర్ ప్లాప్ చేశారో తెలిసిందే.

షుగ‌ర్.. బీపీ ఉన్నా.. మొత్తానికి ఎలాగోలా 11 రోజుల పాటు అవేవో నీళ్లు తాగుతూ దీక్ష చేసిన సీఎం ర‌మేశ్ "త్యాగాని"కి విలువ లేకుండా ఢిల్లీలో కూర్చొని కామెడీ చేసిన తెలుగు త‌మ్ముళ్ల తీరును ఏపీ ప్ర‌జ‌లు మ‌ర్చిపోక ముందే.. మ‌రో దీక్ష‌ను ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓప‌క్క ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర సెగ అంత‌కంత‌కూ పెర‌గ‌టం.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ యాత్ర‌కు పోటెత్తుతున్న జ‌న‌సందోహాన్ని చూస్తున్న టీడీపీ నేత‌ల‌కు ఠారెత్తిపోతున్న ప‌రిస్థితి. ఉత్త‌రాంధ్ర‌కు వ‌చ్చేస‌రికి ఈ ఊపు మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మైన నేప‌థ్యంలో.. ఆ తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు వీలుగా హ‌డావుడిగా దీక్షను త‌మ్ముళ్లు ప్లాన్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో రైల్వేజోన్ హామీని స్ప‌ష్టంగా పేర్కొన్న‌ప్ప‌టికీ.. మోడీ స‌ర్కారు చేత చేయించ‌లేక‌పోయారు చంద్ర‌బాబు.

పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం తొమ్మిది మండ‌లాల్ని ఏపీలో క‌లుపుతూ జీవో జారీ చేసిన త‌ర్వాతే తాను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని బెదిరించి మ‌రీ.. ప‌ని పూర్తి చేయించిన‌ట్లుగా చెప్పే బాబు బ్యాచ్ కు అంత సీనే ఉండి ఉంటే.. రైల్వే జోన్ విష‌యంలో మోడీ స‌ర్కారు మెడ‌లు ఎందుకు వంచ‌లేక‌పోయింద‌న్న‌ది ప్ర‌శ్న‌. గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో ప్ర‌త్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌ర‌చూ దీక్ష‌లు చేస్తున్నా.. క‌నీసం అందుకు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌ని తెలుగు త‌మ్ముళ్లు.. ఇప్పుడు మాత్రం దీక్ష చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం చూస్తే.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం మిన‌హా మ‌రింకేమీ లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం సీఎం ర‌మేశ్ దీక్ష చేస్తుంటే.. డిల్లీలో టీడీపీ నేత‌లు కులాశాగా కూర్చొని నాకు.. ఐదు కేజీలు త‌గ్గాల‌ని ఉంది.. ఏదైనా దీక్ష ఉంటే చెప్పండంటూ ఎట‌కారం మాట‌లు తెలుగు ప్ర‌జ‌లకు వైర‌ల్ వీడియోల రూపంలో అందిన త‌ర్వాత స‌రైన స‌మాధానం చెప్ప‌కుండానే రైల్వే జోన్ కోసం దీక్ష అంటే.. దాని వెనుకున్న అస‌లు కార‌ణం ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు.

ముంచుకొస్తున్న జ‌గ‌న్ ముప్పును ఎదుర్కొన‌టానికి.. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర‌లో అదే ప‌నిగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ దెబ్బ‌కు తెగ ఇబ్బంది ప‌డుతున్న తెలుగు త‌మ్ముళ్లు.. ప్ర‌జ‌ల్లో త‌మ ఉనికి నిల‌బెట్టుకునేందుకు వీలుగా రైల్వే జోన్ సాధ‌న కోసం దీక్ష ప్ర‌క‌టించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నెల 4 నుంచి స్టార్ట్ కానున్న ఎంపీల దీక్ష నేప‌థ్యంలో మరెన్ని కామెడీలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.